శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూన్ 28వ తేదీన పార్వేట ఉత్సవం  నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆల‌య ముఖ మండ‌పంలో ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల ఆదేశాల మేర‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, వాహ‌న సేవ‌లు, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తారు. క్రీ.శ 14వ శతాబ్దం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాధారాల ప్రకారం తెలుస్తోంది. క్రీ.శ 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమపద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. 

 

ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలవబడే శ్రీనివాసపురానికి(ఇప్పుడు శ్రీనివాసమంగాపురం) చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్య పరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుండి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు. అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీ.శ 1540లో చంద్రగిరిని పాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం(పన్నులేని భూమి)గా శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులకు అందజేశారు.


 
అనంతరం క్రీ.శ 1780లో అన్యమత రాజులు ఈ ఆలయాన్ని లూటీ చేశారు. ఆలయ ప్రధానరాజగోపురం, గర్భాలయ గోపురం, విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పాక్షికంగా ధ్వంసమైన కొన్ని విగ్రహాలు ప్రస్తుతం చంద్రగిరికోటలో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నాయి. 1920వ సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ పురాతన కట్టడంగా గుర్తించి పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చింది. ఈ ఆలయం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ రక్షిత కట్టడాల జాబితాలో ఉంది.అనంతరం 1940వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన మధ్వ బ్రాహ్మణుడు సుందరరాజ మంగాపురానికి వచ్చి శ్రీనివాసుడు తనకు కలలో కనిపించాడని తెలిపారు. ”శ్రీనివాసమంగాపురంలో ఉన్న నాకు ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. నా ఆలయానికి పూర్వ వైభవం కల్పించు” అని స్వామి ఆదేశించారని వివరించారు.


 
తరువాత గ్రామపెద్దలైన వెంకటకృష్ణయ్య, నరసింగాపురం రెడ్డివారి నాధమునిరెడ్డి, గుర్రప్ప ఆచారి మరియు తొండవాడ మొగిలి సుందరరామిరెడ్డి తదితరులను సుందరరాజ కలిసి స్వామివారు తనకు కలలో కనిపించిన విషయాన్ని వివరించి సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ముళ్లపొదలు, చీమలపుట్టలు, విషపు కీటకాలు, పాములతో నిండి గోపురాలు కూలిపోయే స్థితిలో ఉండేది. గ్రామపెద్దల సాయంతో సుందరరాజ ముళ్లపొదలు, చీమలపుట్టలను తొలగించి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. స్వామివారు కలలో సూచించిన విధంగా 1940 జులై 11న ఆషాడ శుద్ధ షష్ఠి రోజున తొలిపూజ చేశారు. అదేవిధంగా అర్చకుడైన సుందరరాజకు స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగా టిటిడి అప్పటినుండి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. అలాగే మొదటి పూజను నిర్వహించిన ఆషాడ శుద్ధ షష్ఠి రోజున ”సాక్షాత్కార వైభవం” పేరిట టిటిడి ప్రతి ఏడాదీ ఉత్సవం నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి టిటిడి నిర్వహిస్తుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: