దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండ‌గా నివార‌ణ‌కు తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌రుడు ద‌య త‌ల‌చి అరిక‌ట్టాల‌ని, భ‌క్తుల‌ను, దేశాన్ని ర‌క్షించాల‌ని వేడుకుంటూ శ‌నివారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 27వ తేదీ శ‌నివారం పుష్పయాగం నిర్వ‌హిస్తున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల ఆదేశాల మేర‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, వాహ‌న సేవ‌లు, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తారు. దేశ ప్ర‌జ‌ల‌కు ఆయురారోగ్యాల‌ను ప్ర‌సాదించాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు టీటీడీ అధికారులు, ప్ర‌తినిధులు, వైదిక బృందం తెలిపింది.


పూజా కార్య‌క్ర‌మం కోసం  శుక్ర‌వారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు సేనాధిప‌తి ఉత్స‌వం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వ‌హించారు. జూన్ 27న  ఉదయం 9.00  గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3.00 గంటల‌ నుండి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ ఆల‌యంలో మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.


ఇదిలా ఉండ‌గా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండవ రోజైన శుక్రవారంనాడు సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శాస్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు ఆల‌య ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా  ఈ  కార్యక్రమాలన్నీ ఆల‌యంలో ఏకాంతంగా  నిర్వ‌హించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: