శివుడు.. హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. మ‌రియు శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. ఇలాంటి శివుడికి దేశ‌వ్యాప్తంగా ఎన్నో ఆల‌యాలు ఉన్నాయి. జ్యోతిర్లింగం, పంచారామాలతో పాటు మహాశివునికి సంబంధించిన మరెన్నో చారిత్రక దేవాలయాలను చూడవచ్చు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. సాధార‌ణంగా అన్ని శివాలయాలు తూర్పు ముఖంగా ఉంటుంటాయి. 

 

కొన్ని చోట్ల పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయాలు కూడా చూసి ఉంటారు. కానీ ఈ ఆలయంలో శివ లింగం మాత్రం దక్షిణ ముఖంగా దర్శనమివ్వడం విశేషం. అదే  కాశీ విశ్వేశ్వర ఆలయం. విశాఖ జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయం శివలింగం తెల్లని స్పటిక రూపంలో ఉంటుంది. ఇక్కడ విశేషమేమిటంటే ఇక్కడ ఉన్న లింగం ప్రతి ఏటా పెరుగుతుంది. మ‌రియు ఈ ఆలయంలో శివ లింగం దక్షిణ ముఖంగా దర్శనమిస్తుంది. ఇక ఈ దేవాలయం చ‌రిత్ర చూస్తే.. దాదాపు 250 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి చివరన ఉన్న పంట పొలాల్లో రైతులు కాలువ గట్లు వేసేందుకు అక్కడ ఉన్న పుట్టలను తవ్వడం ప్రారంభించారు. 

 

ఈ క్రమంలో ఓ పుట్టను తవ్వుతుండగా తెల్లని రూపంలో ఈ శివలింగం బయటపడింది. గ్రామస్తులు ఆ శివలింగాన్ని ఆ పంట పొలాల నుంచి తరలించి గ్రామంలో ప్రతిష్టించాలని భావించారు. లింగాన్ని బయటకు తీసేందుకు భూమిలో దాదాపు 25 అడుగుల మేర తవ్వినా శివలింగం కనిపిస్తుంది కానీ లింగం చివరి భాగం మాత్రం బయటపడలేదు. భూమిలో నుంచి సర్పాలు కూడా రావడంతో భయపడిన గ్రామస్తులు శివలింగాన్ని అక్కడే ఉంచి దేవాలయాన్ని నిర్మించారు. ఇక అప్ప‌టి నుంచి ఇక్కడ గ్రామస్తులు శివలింగానికి స్వయంగా అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ అవకాశాన్ని వారు తమ అదృష్టంగా భావిస్తుంటారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: