ఎక్కువ మంది హిందువులు నిత్య దీపారాధన చేస్తుంటారు.  మరి కొందరు ప్రత్యేక రోజుల్లో మరియు మంగళ, శుక్రవారాలు మాత్రమే పూజలు చేస్తుంటారు. పూజ అనగానే మొదటగా మనకు గుర్తొచ్చే విషయం పూలు. పూలు లేనిదే పూజ పరిపూర్ణం కాదు అని మన పెద్దలు చెబుతుంటారు. యజ్ఞానికి అయినా హోమానికి అయినా నిత్య పూజకు అయినా దేవుడు అంటే ముందుగా పూల గురించే ఆలోచిస్తాం. పూజ చేయాలి అంటే ముందుగా పూజ గదిని శుభ్రపరచి దేవుళ్ళ పటాలను రకరకాల పూలతో అలంకరిస్తాము. పూజ అనగానే పూలకు, దీపారాధనకు అంతగా ప్రాముఖ్యత ఇస్తాము. పూజలో పూలు ఉంచడం పూలతో అలంకరించడం పురాతన కాలం నుండి మన ఆనవాయితీగా వస్తోంది. 

అయితే దేవుడి పూజ కొరకు వాడే పూలను ఎలా పడితే అలా కోయ రాదని అదే విధంగా ఆ పూల యజమానికి తెలియకుండా తెంపరాదని పురాణాలు చెబుతున్నాయి. పూలను కర్రలతో కొట్టి కోయరాదు చేతితోనే కోయాలి. అలాగే మనలో చాలా మంది పూజ సమయం అయ్యేటప్పటికీ ఇంట్లో పూలు లేకపోయినా, బయట పక్కింటి వాళ్ళ ఇంట్లోనో ఎదురింటి వాళ్ళ ఇంట్లోనో పూజ ఆకర్షణీయంగా కనిపించినా అవి కోసుకొచ్చి పూజకు వినియోగిస్తూ ఉంటాము. అయితే ఇలా చేసేవారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ మీరు బయట వారి ఇళ్ళలో పూలు  పూజ కోసం కోయాలి అనుకుంటే, ఖచ్చితంగా ఆ పూల చెట్టు యొక్క యజమాని అనుమతి తప్పకుండా తీసుకోవాలి అని గరుడ పురాణంలో చెప్పబడింది. 

గరుడ పురాణంలో "తాంబూల ఫల పుష్పాది హర్తస్యా ద్వానరో వనే !
ఉపనతృణ కార్పాసహర్తస్సా న్మేష యోనిషు !!" అన్న ప్రకారం చెప్పబడింది ఏమిటి అంటే తాంబూలము కానీ, పండ్లు కానీ, పూలను కానీ దొంగతనం చేసే వారు వచ్చే జన్మలో అడవిలో కోతిలాగా...అలాగే  చెప్పులు, పత్తి, గడ్డి వంటివి దొంగిలించే  వారు మేకల జన్మిస్తారని అందులోని అంతరార్థము. కాబట్టి పూలను ఆ పూల మొక్క యొక్క యజమానికి తెలియకుండా కోయరాదని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: