స్మార్ట్ సిటీ విశాఖలో వినాయకుడికి ఫైన్ల భయం పట్టుకుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు...భారీ మండపాలపై ఆంక్షలు విధించారు. వేడుకల్లో నిబంధనలు అతి క్రమిస్తే కొరడా ఝుళిపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 


వినాయక చవితి సమీపిస్తుండటంతో గ్రేటర్ నగరం విశాఖలో సందడి మొదలైంది. నవరాత్రుల్లో పూజలు అందుకునే భారీ గణనాథులు  ముస్తాబయ్యారు. ఆకర్షణీయమైన రూపాలు, రంగులతో మండపాలు సిద్ధమవుతున్నాయి.  అందమైన ,ఆకర్షణీయమైన,ఎత్తైన భారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. అయితే ఈ ఏడాది వినాయక చవితిపై జీవీఎంసీ ఆంక్షలు విధిస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ రాఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాల ఏర్పాటుపై కన్నెర్ర చేస్తోంది. స్మార్ట్ సిటీ విశాఖలో కాలుష్య నియంత్రణ ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ప్రమాదకర రసాయినాలు,రంగులతో తయారు చేసిన బొజ్జగణపయ్యలను సముద్రంలో నిమర్జనం చేసినప్పుడు ఆ దుష్ప్రభావం జలకాలుష్యానికి  కారణమౌతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం స్మార్ట్ సిటీ గైడ్ లైన్స్ కు విరుద్ధమని అధికారులు అంటున్నారు.


ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రోత్సహిస్తూనే....ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రూపొందించిన వినాయక మండపాలకు ఫైన్లు విధించాలని నిర్ణయించారు. ఇది ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రమేనని జీవీఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. ఫైన్లు నామమాత్రంగానే వుంటాయన్నారు. విశాఖ మహా నగర పరిధిలో క్రిందటేడాది 810 వినాయక మండపాలు ఏర్పాటయ్యాయి. ఈఏడాది వాటి సంఖ్య డబుల్ అయ్యే అవకాశం వుందని పోలీస్ శాఖ అంచనా వేస్తోంది. వినాయక మండపాల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్ లైన్ విధానం అమలులోకి తెచ్చింది.  రిజిస్టర్ చేసుకున్న మండపాలకు... జీవీఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ,విద్యుత్ శాఖ నుంచి క్లియరెన్స్ వస్తేనే మండపాల ఏర్పాటుకు అనుమతించాలని నిర్ణయించారు. ఇక, ప్రతీ మండపానికి కోడ్ కేటాయించనున్నారు. ఉత్సవాల నిర్వహణ నుంచి విగ్రహాల నిమర్జనం వరకూ పకడ్భందీగా నిర్వహించేందుకు ఈ విధానం ఉపయోగించనుంది.


మరోవైపు, మండపాల్లో ఏర్పాటు చేసే విగ్రహాల ఎత్తును 8అడుగులకు పరిమితం చేశారు. భారీ మండపాలు,విగ్రహాల ఏర్పాటుకు ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. ఇక నిమజ్జనం వేళ ఆంక్షలు విధించారు. పర్యాటక ప్రాంతం కావడంతో రామకృష్ణబీచ్ నుంచి కోస్టల్  బ్యాటరీ వరకూ విగ్రహాలను సముద్రంలో కలపడంపై నిషేధం విధించారు అధికారులు. ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో పండుగులు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. తాజాగా ప్రవేశ పెడుతున్న అధికారుల ఆంక్షలు ఎంతమేర ప్రభావం చూపిస్తుందో చూడాల్సి ఉంది.  




మరింత సమాచారం తెలుసుకోండి: