కాణిపాకం.. ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు వినాయకుడే గుర్తొస్తాడు. కానీ తెలంగాణలో కూడా అలాంటిదే ఓ భారీ గణేశ ప్రతిమ ఉంది. దేశంలోనే అతి ఎత్తైన గణపతిగా ఇది  భాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే.. ఈ ప్రతిమ పాలమూరు జిల్లాలో ప్రతిష్ఠితమై ఉంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. దాదాపు 25 అడుగుల ఎత్తు,15 అడుగుల వెడల్పు వున్న ఈ ఏకశిలా వినాయక  విగ్రహానికి ఎన్నో విశేషాలున్నాయి. 


భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా రాతి విగ్రహం ఎక్కడ ఉంది? అంటే అందరూ తమిళనాడులోనో..కర్నాటకలోనో ఉండి ఉండవచ్చని చెపుతారు తప్ప మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఆవంచ గ్రామంలో 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉన్న ఏకశిలా గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని, గుండు  గణపతి, ఐశ్వ‌ర్య గ‌ణ‌ప‌తి అని పిలుస్తుంటారు. మరో విశేషం ఏమిటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తుంటారు. ఇంత‌టి చారిత్ర‌క నేప‌థ్యం ఉన్నప్పటికి, ఈ అపురూపమైన విగ్రహాన్ని పట్టించుకొనే నాథుడే లేడు. ఆ విగ్రహానికి గుడి లేదు... కనీసం చుట్టూ గోడ కూడా లేదు. ప‌ద‌కొండ‌వ శ‌తాబ్దంలో చాళుక్యుల కాలంలో ఏర్పాటు చేసిన‌ట్టు చెబుతున్న ఈ చారిత్ర‌క విగ్ర‌హ‌నికి  చుట్టూ ఉన్న పొలాలే ఆ మహాగణపతి  సామ్రాజ్యం. అందులో పనిచేసుకొనే రైతులే ఆయన భక్తులు. వారు అప్పుడప్పుడు పెట్టే అరటిపండు నైవేద్యం, పూజ‌లతోనే స‌రిపెట్టుకుంటున్నాడు ఈ మ‌హ గ‌ణ‌ప‌తి.


పదేళ్ల క్రితమే ఈ భారీ వినాయకుడి విగ్రహం వెలుగులోకి వచ్చినా.. ప్రభుత్వం గాని స్థానిక నాయకులు కానీ పట్టించుకోలేదు. పంట పొలాల మధ్య ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ ఏలికల నిరాదరణకు సాక్ష్యంగా  నిలుస్తోంది. నాలుగేళ్ల క్రితం పుణెకు చెందిన ఉత్తరదేవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామన్న హామీ అమలు కాలేదు.  ప్రస్తుతం ఏదైన పర్వదినం నాడు మాత్రమే ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి. ఆలయ నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ట్రస్టు సభ్యులు అంచనా కూడా వేశారు. ప్రభుత్వం ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు  కోరుతున్నారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం.. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: