హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అప్పటికీ.. ఇప్పటికీ నిమజ్జనం సందడి తగ్గకపోయినా.. ప్రక్రియ మాత్రం బాగా సులువైంది. గతంలో నిమజ్జనం అంటే జనం భయపడేవాళ్లు. ట్రాఫిక్ ఆంక్షలు, గంటల తరబడి విగ్రహాల తరలింపుతో ఇబ్బందిపడేవాళ్లు. కానీ క్రమంగా పరిస్థితి మారింది. ఇప్పుడు అనుకున్న సమయంలోనే నిమజ్జనం పూర్తవుతోంది. గణేష్ మండపాల నిర్వాహకుల సహకారంతో అధికారులు ఎప్పటికప్పుడు.. నిమజ్జనాన్ని సులభతరం చేస్తూ వచ్చారు. 
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం అంటే ఆ సందడే వేరు. దేశంలో ముంబై తర్వాత భాగ్యనగరంలో జరిగే నిమజ్జనానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భారీ విగ్రహాలు, వెరైటీ కాన్సెప్టులతో రూపొందించిన విగ్రహాలు అందరికీ కనువిందు చేస్తాయి. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు జరిగే శోభాయాత్రకు లక్షల్లో భక్తులు హాజరవుతారు. నిమజ్జనం సందర్భంగా యువత డప్పులు, డ్యాన్సులతో హడావిడి చేస్తారు. పిల్లలు కూడా వెరైటీ వినాయక విగ్రహాల్ని చూడటానికి ఉత్సాహం చూపిస్తారు. ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే. కానీ రెండోవైపు ట్రాఫిక్ కష్టాలు చాలా ఉంటాయి. 


ఒకప్పుడు గణేష్ నిమజ్జనం అంటేనే హైదరాబాదీలు భయపడేవాళ్లు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి రెండు రోజులు పట్టేది. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండేవి. దీంతో ఆఫీసులకు, పనుల మీద బయటకు వెళ్లేవాళ్లు చాలా ఇబ్బందిపడేవాళ్లు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేనిచోట నరకయాతన అనుభవించేవాళ్లు. ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నివసించే జనమైతే.. మరిన్ని సమస్యలు ఎదుర్కునేవాళ్లు. నిమజ్జన వ్యర్థాల తొలగింపు కూడా వారాల తరబడి కొనసాగేది. కానీ క్రమంగా అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో నిమజ్జనం ప్రక్రియ బాగా సులభతరమైంది. వినాయక విగ్రహం పెట్టేటప్పుడే.. నిమజ్జనం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలనే ప్లాన్ రూపొందిస్తున్నారు నిర్వాహకులు. ఇలాంటి ప్రణాళిక ఉన్న విగ్రహాలకే పోలీసులు కూడా అనుమతిస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక మండపాల నిర్వాహకులతో మాట్లాడి.. దగ్గర్లో చెరువుల్లోనే నిమజ్జనం అయ్యేలా చూస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే శోభాయాత్రలో విగ్రహాల రద్దీ తగ్గింది. ట్రాఫిక్ ఆంక్షల విషయంలో కూడా పరిస్థితి బాగా మెరుగుపడింది. ట్రాఫిక్ ఆంక్షలపై ముందే సమాచారం ఇవ్వడంతో పాటు.. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తున్నారు. దీంతో పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులకు వెళ్లడానికి వీలౌతోంది. 
ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం రెండేళ్లుగా అనుకున్న సమయానికి పూర్తయ్యేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మిగతా విగ్రహాలు వచ్చేటప్పుడు పెద్దగా ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సిన పని ఉండటం లేదు. పదకొండోరోజు మధ్యాహ్నానికే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తైపోతుండటంతో.. తర్వాత జనం కూడా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. మొత్తం మీద ఓ ప్రణాళిక ప్రకారం జీహెచ్ఎంసీ, పోలీసులు.. మండపాల నిర్వాహకులతో జరిపిన చర్చలకు ఫలితం రెండేళ్లుగా కనిపిస్తోంది. వినాయక మండపానికి అనుమతిచ్చేటప్పుడే సదరు విగ్రహం నిమజ్జనం ఎలా అనేదానిపై పోలీసులకు కూడా ఓ క్లారిటీ ఉంటోంది. దీంతో నిమజ్జనం రోజు ఎలాంటి హడావిడి లేకుండా ముందే ప్లాన్ చేసుకోవడానికి వీలౌతోంది. 


గతంతో పోలిస్తే నిమజ్జన వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. నిమజ్జనం పూర్తైన గంటల వ్యవధిలోనే పరిసరాల్ని శుభ్రం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు నిమజ్జన కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంటున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వ్యర్థాల తొలగింపును పర్యవేక్షిస్తూ.. ఎలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. హైదరాబాద్ లో ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన సాగర్ తో పాటు స్థానికంగా ఉన్న చెరువుల దగ్గర కూడా క్రేన్ లు, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండటంతో.. నిమజ్జనం ప్రక్రియ సజావుగా, సాఫీగా, వేగంగా జరిగిపోతోంది. హైదరాబాదీలకు నిమజ్జనం టెన్షన్ తప్పుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: