సిరిమాను ఉత్సవాలకు విజయనగరం పట్టణం ముస్తాబవుతోంది. సుమారు నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు అధికారులు. అక్టోబర్ 14,15 తేదీల్లో ప్రధాన ఘట్టాలైన తొలేళ్లు, సిరిమాను ఉత్సవాలు జరగనున్నాయి. లక్షల మంది భక్తులు వచ్చే ఈ ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు.


విజయనగరంలో కొలువైన ఉన్న శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలతో విజయనగరం పట్టణం కళకళలాడనుంది. ఇప్పటికే  పందిరాట ఉత్సవంతో అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. అక్టోబర్ 14న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం జరగనుండగా, 15న ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం జరగనుంది. దీనితో పాటే అక్టోబర్ 12,13,14వ తేదీలలో విజయనగర ఉత్సవాలు సైతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


సిరిమాను ఉత్సవం కోసం అవసరమైన చింతచెట్టును విజయనగరం సమీపంలోని రామవరం అనే గ్రామంలో గుర్తించారు. ఈ చెట్టుకు శాస్ర్తోత్తంగా పూజలు చేసి, విజయనగరం తీసుకొచ్చారు. ఇప్పటికే గుర్తించిన చెట్టును విజయనగరం హుకుంపేటలో సంప్రదాయబద్ధ రీతిలో సిరిమానుగా మలుస్తున్నారు. ప్రతీరోజూ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భక్తి శ్రద్ధలతో సిరిమాను చెట్టుకు పూజలు  చేస్తున్నారు. అమ్మవారి ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలైన తోలేళ్లోత్సవం, సిరిమాను ఉత్సవం.. తర్వాత తెప్పోత్సవం జరగనుంది. చివరిగా అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవంతో ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు ముగియనున్నాయి.


పూసపాటిరాజుల ఆడపడచు అయిన పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతీ ఏడాది అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలైన పూసపాటి రాజవంశీయులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్ర్రాలు సమర్పించారు. ఈ పండగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఈ ఏడాది నుంచి టీటీడీ, ప్రభుత్వం తరపు నుంచి కూడా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి ప్రధాన పూజారి నివసించే ప్రాంతమైన హుకుంపేటలో సిరిమాను రూపుదిద్దుకుంటుంది. అక్కడ నుంచి ఈ సిరిమానును అమ్మవారి చదురుగుడి వద్దకు మేళతాళాలు, సాంస్కృతిక కళారూపాయలు నడుమ సంప్రదాయబద్దంగా తీసుకువస్తారు. అనంతరం అమ్మవారి రూపంగా ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహిస్తారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సిరిమాను ఉత్సవ, విజయనగర ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిలు  దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా ఈసారి ఘనంగా ఏర్పాట్లు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: