ఏడుకొండలపై కొలువున్న తిరుమలేశుని దర్శించుకోవాలని కోరుకోని తెలుగు భక్తులు ఉండరు. ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివితీరని అనుభవం అది. అయితే దర్శనం ఎవరికైనా దొరుకుతుంది కానీ.. ఆయనకు ఇచ్చే హారతులు మాత్రం అందరూ చూడలేరు. ఆయా సేవల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే ఆ అదృష్టం దొరుకుతుంది.


స్వామివారికి సుప్రభాత సమయంలో నవనీత హారతి ఇస్తారు. శ్రీవారు స్వయంగా తన భక్తుడైన హథీరాం బావాజీతో పాచికలాడినటు చెబుతారు. ఆయన భక్తిని నిదర్శనంగా స్వీకరించేదే ఈ హారతి. ఇందుకోసం తిరుమలలోని హాథీరాంజీ మఠం నుంచి అప్పుడే తీసిన వెన్నను ఉపయోగిస్తారు.


మరో హారతి నక్షత్ర హారతి.. రోజూ సుప్రభాత సేవ, తోమాల సేవ ముగిసిన వెంటనే సహస్రనామార్చన జరుగుతుంది. అది పూర్తవగానే ఇచ్చే హారతిని నక్షత్ర హారతి అంటారు. నేతితో అద్దిన 27 వత్తులను నక్షత్రంలో ఉండే హారతి సెమ్మెలో వుంచి వాటిని వెలిగించిహారతి ఇస్తారు.


ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం అనంతరం ఇచ్చే హారతి పచ్చకర్పూర హారతి. పట్టువస్త్రం, ఆభరణాలు, పుష్పమాలలను అలంకరించిన తరువాత ఈ హారతినిస్తారు. స్వామికి రోజూ తెల్లవారుజామున మొదలు రాత్రి వరకు జరిగే ప్రతి సేవకు చివర మూలమూర్తికి కర్పూర హారతినివ్వడం సంప్రదాయం. ఇక రోజూ రాత్రి ఏకాంత సేవ సమయంలో ముత్యాల హారతినిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: