పెద్దగా అంచనాలు లేకుండా వరల్డ్‌కప్ సమరానికి సిద్ధమైన వెస్టిండీస్‌ టోర్నీని ఘనంగా ఆరంభించింది. పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి బోణి కొట్టింది. పాకిస్థాన్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 13.4 ఓవర్లలో 3 నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. ఛేదనలో విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ( 50 ; 34 బంతుల్లో 64 36 ) అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. వెన్నునొప్పి వేధిస్తున్నా భారీ సిక్సర్లు బాదేశాడు. 


మరో ఓపెనర్ షై హోప్ (11 పరుగులకే ) త్వరగానే అవుటయ్యాడు. వన్ డౌన్ దిగిన డారెన్ బ్రేవో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. నికోలస్‌ పూరన్‌ (34*; 19 బంతుల్లో 4×4, 2×6) పరుగులతో హెట్ మైయిర్ (7) తో కలిసి  సునాయాసంగా ఛేదించారు. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ ఆమిర్‌ మూడు వికెట్లు సాధించడం మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. విండీస్ కోల్పోయిన మూడు వికెట్లు అమీర్ ఖాతాలోకి వెళ్లడం గమనార్హం. 


పాక్ విల విల


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ ను విండీస్ బౌలర్లు విలవిల్లాడించారు. ఒక్కరూ కూడా 30పరుగులు చేయలేదు. ఒకదశలో 85 పరుగులకే చాప చుట్టేలా కనిపించింది. చివర్లో వాహబ్ రియాజ్ (18) రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో స్కోర్ 100 దాటింది. 


విండీస్‌ బౌలర్ల షార్ట్‌పిచ్‌ బంతులకు పాక్‌ ఆటగాళ్లు బెంబేలెత్తారు. గతంలో ఎప్పుడూ ఆడనట్టే ప్రవర్తించారు. విండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ  పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. ఒషాన్‌ థామస్‌ (4/27), జాసన్ హోల్డర్‌ (3/42), ఆండ్రీ రసెల్‌ (4/2) భారీ దెబ్బకొట్టారు. నాలుగు వికెట్లు పడగొట్టిన ఒషాన్‌ థామస్‌ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: