కొన్ని నెలల క్రితమే యువరాజ్ సింగ్ ఆంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించిన సంగతీ తెలిసిందే. అయితే యువరాజ్ మాత్రం ఇంటర్ నేషనల్ టీ 20 లీగ్స్ లో మాత్రం ఆడుతున్నారు. ఇంటర్ నేషనల్ క్రికెట్ లో యువీని మిస్ అయిన అభిమానులకు కెనడా టీ20 లో మాత్రం యువీ ఆటను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లీగ్ లో యువీ సిక్సర్స్ తో అభిమానులను అలరిస్తున్నారు. దీనితో అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో షేర్ చేసుకుంటున్నారు. 


తాజాగా జరుగుతున్న గ్లోబల్ టీ20 కెనడా 2019 లీగ్‌లో టోరంటో నేషనల్స్ టీమ్‌ కెప్టెన్‌గా ఆడుతున్న యువరాజ్ సింగ్.. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.  మ్యాచ్‌లో టోరంటో టీమ్‌ కెప్టెన్‌గా టాస్ గెలిచిన యువరాజ్ సింగ్ ప్రత్యర్థి జట్టు ఎడ్మోంటన్ రాయల్స్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. దీంతో.. మొదట బ్యాటింగ్ చేసిన ఎడ్మోంటన్ జట్టు.. బెన్ కటింగ్ (43: 24 బంతుల్లో 1x4, 4x6), షదాబ్ ఖాన్ (36: 17 బంతుల్లో 2x4, 3x6), కెప్టెన్ డుప్లెసిస్ (28: 18 బంతుల్లో 1x4, 3x6) దూకుడుగా ఆడటంతో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.


ఛేదన ఆరంభంలోనే టోరంటో జట్టు ఓపెనర్లు థామస్ (8), మెక్లాయిడ్ (0) రూపంలో రెండు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ (35: 21 బంతుల్లో 3x4, 3x6) మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ క్లాసెన్ (45: 39 బంతుల్లో 2x4, 3x6)తో కలిసి భారీ షాట్లతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా పాకిస్థాన్ స్పిన్నర్ షదాబ్ ఖాన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా అతను కొట్టిన సిక్సర్ మునుపటి యువీని తలపించింది. అయితే.. జట్టు స్కోరు 85 వద్ద యువీ ఔటవగా.. కీరన్ పొలార్డ్ (2), క్రిస్‌గ్రీన్ (9) నిరాశపరిచారు. కానీ.. ఆఖర్లో మన్‌ప్రీత్ గోనీ (33: 12 బంతుల్లో 3x4, 3x6) మెరుపులు మెరిపించి 17.5 ఓవర్లలోనే 192/8తో టోరంటో టీమ్‌ని గెలిపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: