విండీస్ తో జరగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ఆటతీరు కనబరిచిన ఇండియా.. వెస్టిండీస్ కు చుక్కలు చూపించింది. ప్రత్యేకించి బౌలర్ బుమ్రా ఈ మ్యాచ్ లో సోలో హీరోగా మారాడు. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి తన పేస్‌ ‘ట్రైలర్‌'చూపిన బుమ్రా.. రెండో టెస్టులో ఏకంగా సినిమా చూపించేశాడు. క్రీజులోకొచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఏ బంతిని వదిలేయాలో..ఏ బంతిని ఆడాలో తెలియని ఆయోమయంలో ఉండగానే వారి కథ ముగించాడు. ఈ ఒక్క బంతికి ఔట్‌ కాకుంటే చాలు అన్న చందంగా బ్యాట్స్‌మెన్‌ బిక్కబిక్కుమంటూ గడిపారంటే కరీబియన్లను బుమ్రా ఏ రేంజ్‌లో భయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు. హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లు పడగొట్టి కరీబియన్లకు పీడకల మిగిల్చాడు.


మూడో రోజు చక్కటి ఆటతీరుతో టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడానికి కోహ్లీసేనకు అడ్డుగా ఉంది మరో ఎనిమిది వికెట్లే. మరి రెండు రోజులు మిగిలి ఉన్న ఆటలో.. కొండంత లక్ష్యాన్ని విండీస్‌ ఛేదిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. 468 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన విండీస్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.


ప్రస్తుతం క్రీజులో డారెన్‌ బ్రావో , బ్రూక్స్‌ ఉన్నారు. రెండో ఇన్నింగ్‌లోనూ విండీస్‌ ఓపెనర్లు నిరాశ పరిచారు. కనీస పోరాటం చేయకుండానే బ్రాత్‌వైట్‌(3) తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో పంత్‌ చేతికి చిక్కడంతో భారత్‌కు తొలి వికెట్‌ దొరికింది. మరో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌(16) కాసేపు పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ షమి చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో 37 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు.


అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన భారత్‌.. విండీస్‌ను 117 పరుగులకే కుప్పకూల్చింది. ప్రత్యర్థికి ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో రహానె(64నాటౌట్‌; 109బంతుల్లో 8×4, 1×6), విహారి(53నాటౌట్‌; 76బంతుల్లో 8×4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో మొత్తంగా భారత్‌ 467 పరుగుల ఆధిక్యం సాధించినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: