ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్, తెలుగు తేజం పీవీ సింధు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని సచివాలయంలో ఆమె తల్లిదండ్రులతో కలిసి జగన్ ను కలిశారు. అధికారులు ఆమెను జగన్ వద్దకు తోడ్కొని వెళ్లారు. ప్రపంచ ఛాంపియన్ గా సింధు పతకం గెలిచాక రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం. 

 

 

 

సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. సింధును శాలువాతో సత్కరించి ఆమె సాధించిన ఘనతను కొనియాడారు. సింధుకు సీఎం జ్ఞాపికను బహుకరించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.  సింధు తాను సాధించిన మెడల్ ను సీఎం జగన్ కు చూపించారు.  ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. తన ఆటతీరును జగన్ ప్రశంసించారని అన్నారు. పద్మభూషణ్ అవార్డుకు తన పేరు పరిశీలనకు వెళ్లడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సింధు అన్నారు. విశాఖలో  బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయడానికి అయిదు ఎకరాల స్థలం కేటాయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని సింధు తెలిపారు. అనంతరం అక్కడినుంచి రాజ్ భవన్ కు సింధు చేరుకున్నారు. గవర్నర్ హరిచందన్ ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గవర్నర్ ప్రపంచ ఛాంపియన్ సింధును సన్మానించి ఆమె సాధించిన ఘనతకు ప్రశంసించారు.

 

 

 

అంతకుముందు సింధుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సాదర స్వాగతం పలికారు. సీఎం వద్దకు ఆమెను తోడ్కొని వెళ్లారు. సింధు వెంట చాముండేశ్వరీ నాథ్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆమె తల్లిదండ్రులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో  రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సింధుకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: