హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపిక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, ఆపై అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఈ నెల 24 నుంచి వచ్చే నెల 11 వరకు బెంగళూరులో జరగనున్న విజయ్ హజారే టోర్నీ కోసం హైదరాబాద్ జట్టును ప్రకటించిన సెలక్టర్లు అంబటికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. బి.సందీప్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

అంతర్జాతీయ క్రికెట్‌‌కు ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుపుతూ, ఇటీవల రాయుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాశాడు. సెలక్షన్‌కు తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అసోసియేషన్ రాయుడికి ఏకంగా జట్టు పగ్గాలు అప్పగించడం విశేషం.


అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2013లో అరంగేట్రం చేసిన అంబటి రాయుడు.. భారత్ తరఫున ఇప్పటి వరకూ 55 వన్డేలాడి 1,694 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉండగా 10 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ అనుభవాన్ని వినియోగించుకోవాలని హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4‌లో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ ఇప్పటికీ దొరక్కపోవడంతో రాయుడు మళ్లీ రేసులోకి వస్తాడేమో చూడాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: