టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు రెడీ అవుతున్న కోహ్లీ సేనకు జస్ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. వెన్ను గాయంతో తీవ్రంగా బాధపడుతున్న బూమ్రాకు విశ్రాంతి కల్పించింది బీసీసీఐ. అతని స్థానంలో ఉమేశ్‌ యాదవ్ టీమిండియాలో కలవనున్నాడు. 


ఆటగాళ్లకు జరిపే సాధారణ స్క్రీనింగ్ టెస్టుల్లో యార్కర్ స్పెషలిస్ట్ బూమ్రాకు గాయం ఉన్నట్టుగా గుర్తించారు బీసీసీఐ వైద్యులు. వెంటనే సెలక్షన్ కమిటీకీ సమాచారం ఇవ్వడంతో.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు అతనికి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20, టెస్ట్ ఛాంపియన్ సిరీస్‌కు బూమ్రా అందుబాటులో ఉండడు. దీంతో.. సుమారు 7 నుంచి 8 వారాలు జట్టుకు దూరంగా ఉండనున్నాడు బూమ్రా. 


వెన్ను గాయంతో ఉన్న బూమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడు. గాయాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం మంచిదైంది. గాయం ఎక్కువ కాక పోవడానికి ముందే గుర్తించడం వల్ల బూమ్రా కోలుకోవడానికి రెండు నెలల సమయమే పడుతుంది. లేదంటే ఇలాంటి గాయానికి ఇంకా ఎక్కువ సమయం అవసరం అయ్యి ఉండేదంటున్నారు బీసీసీఐ అధికారులు. 


ఇటీవల జరిగిన టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండు టెస్టు మ్యాచుల్లో మొత్తంగా 13వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం గాయం కారణంగా బుమ్రా స్థానాన్ని ఉమేశ్ యాదవ్‌ భర్తీ చేయనున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ చివరిగా 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో మైదానంలోకి దిగాడు. అప్పటి నుంచి ఉమేశ్‌కు టీమిండియాలో చేరే అవకాశం రాలేదు. మరోవైపు.. సఫారీలతో కోహ్లీసేన మూడు టెస్టులు ఆడనుంది. ఎల్లుండి నుంచి వైజాగ్‌లో ఇరు జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగనుంది. అక్టోబర్ రెండున భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: