అథ్లెటిక్స్ మహా సంగ్రామానికి వేళయింది. రెండేళ్లకోసారి జరిగే  వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌కు శుక్రవారం తెరలేవనుంది. మెడల్‌‌ గురించి ఆలోచించడం అత్యాశే అనిపిస్తుండగా… కనీసం ఫైనల్స్‌‌కు క్వాలిఫై అయితేనే గొప్పగా చెప్పుకోవచ్చని భావిస్తున్న ఇండియా 27  మంది అథ్లెట్లతో ఈ మెగా ఈవెంట్‌‌లో బరిలోకి దిగుతోంది. అక్టోబర్‌‌ 6 వరకు జరిగే ఈ టోర్నీకి నీరజ్‌‌ చోప్రా, హిమాదాస్‌‌ గైర్హాజరు కావడం ఇండియా మెడల్‌‌ అవకాశాలను దెబ్బతీసింది.

నాలుగు నెలల కిందట మోచేయికి సర్జరీ చేయించుకున్న వరల్డ్‌‌ క్లాస్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్‌‌ మొదలు పెట్టాడు. ఈ మెగా టోర్నీని దృష్టిలో ఉంచుకొని నాలుగు నెలల పాటు యూరప్‌‌లో ట్రైనింగ్‌‌ తీసుకున్న  హిమాదాస్‌‌ (400 మీ.) ఇంటర్నేషనల్‌‌ లెవల్‌‌లో పలు మెడల్స్‌‌ నెగ్గి ఆశలు పెంచింది. కానీ, వెన్ను నొప్పి కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలింది.మిగతా అథ్లెట్లలో  స్టార్‌‌ స్ప్రింటర్‌‌ ద్యుతీచంద్‌‌, లాంగ్‌‌ జంపర్‌‌ శ్రీశంకర్‌‌, మెట్రిక్‌‌ మైలర్‌‌ జిన్సన్‌‌ జాన్సన్‌‌, షాట్‌‌ పుటర్‌‌ తేజిందర్‌‌ పాల్‌‌పై  అంచనాలు ఉన్నాయి.

100 మీ. రన్‌‌లో ద్యుతీ కనీసం సెమీఫైనల్‌‌కు చేరుకుంటుందని అంతా ఆశిస్తున్నారు. తొలి రోజు పోటీల్లో శ్రీశంకర్‌‌ క్వాలిఫయింగ్‌‌ రౌండ్‌‌లో పోటీ పడనున్నాడు.  4×400 మీ. మూడు  రిలేల్లో  ఇండియా జట్లు ఫైనల్‌‌కు అర్హత సాధించగలవని అథ్లెటిక్స్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా భావిస్తోంది. అందుకే,  మన జట్టులో 13 మంది రిలే రన్నర్లకే చాన్స్‌‌ ఇచ్చింది. నేషనల్‌‌ రికార్డు హోల్డర్‌‌ మహమ్మద్‌‌ అనాస్‌‌… వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ క్వాలిఫికేషన్‌‌ మార్క్‌‌ను దాటినప్పటికీ  వ్యక్తిగత 400 మీ. రేసులో అతనికి చోటివ్వలేదు.

ఫైనల్‌‌ అవకాశాలు మెరుగు పరిచేందుకు పురుషుల 4×400 రిలేలో మాత్రమే అతడిని బరిలోకి దింపుతోంది. ముఖ్యంగా  ఈ ఎడిషన్‌‌లో కొత్తగా చేర్చిన మిక్స్‌‌డ్‌‌ 4×400 రిలేపై భారీ ఆశలు పెట్టుకుంది.  లండన్‌‌లో జరిగిన గత ఎడిషన్‌‌లో పురుషుల జావెలిన్‌‌ త్రోలో దవీందర్‌‌ సింగ్‌‌ ఒక్కడే ఫైనల్‌‌కు చేరుకోగలిగాడు. ఓవరాల్‌‌గా ఈ టోర్నీ చరిత్రలో ఇండియా ఒకే ఒక్క మెడల్‌‌ సాధించింది. 2003లో అంజూ బాబీ జార్జ్‌‌ లాంగ్‌‌జంప్‌‌లో కాంస్యం అందించింది.


    మరింత సమాచారం తెలుసుకోండి: