అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన పరుగులో విజేత ఎవరో తెలిసిపోయింది. 100 మీటర్ల పరుగులో నయా ఛాంపియన్‌ వచ్చాడు. వరల్డ్ అథెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ లేకపోయినా ఆ లోటుని అమెరికా స్ప్రింటర్ కోలమన్‌ తన ప్రదర్శనతో భర్తీ చేశాడు. రేసులో సీనియర్లని వెనక్కి నెట్టిన ఈ 23 ఏళ్ల పరుగుల వీరుడు పసిడిని ఎగరేసుకుపోయాడు.


జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఈసారి రేసులో లేకపోవడంతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ బోసిపోతుందేమో..? అని అంతా ఊహించారు. కానీ.. 100మీ పరుగు పందెంలో బోల్ట్‌ని తలపిస్తూ అమెరికా స్ప్రింటర్ క్రిస్టియన్ కోల్‌మన్ పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో 100మీ పరుగుని కోల్‌మన్ కేవలం 9.76 సెకన్లలోనే చేశాడు. గత ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన కోల్‌మన్‌.. ఈసారి స్వర్ణం ఎగరేసుకుపోయాడు.  ఫైనల్లో కోల్‌మన్‌ 9.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానం సాధించాడు. అమెరికాకే చెందిన గాట్లిన్‌ 9.89 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక కెనడాకు చెందిన ఆండ్రి డిగ్రాస్‌ మూడో స్థానం సాధించాడు. 


మధ్యాహ్నం అదరిపోయే ఎండ.. రాత్రి తట్టుకోలేనంత ఉక్కపోత.. ఈ రెండింటితోపాటు విశ్వాన్నీ జయించాడు ఈ అమెరికా సెన్సేషన్‌. క్రిస్టియన్ కోల్‌మన్ గత కొంతకాలంగా 100మీ పరుగులో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. దీంతో.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ అతనికి పతకం ఖాయమనే వార్తలు వచ్చాయి. తాజాగా అంచనాల్ని అందుకున్న కోల్‌మన్ ఏకంగా స్వర్ణ పతకంతో మెరిశాడు. టోర్నీ సెమీ ఫైనల్లోనూ అందరూ 10 సెకన్లపైనే 100మీ పరుగుని పూర్తి చేయగా.. కోల్‌మన్ మాత్రం 9.88 సెకన్లలోనే పూర్తి చేశాడు. దీంతో.. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్న ఈ 23 ఏళ్ల అమెరికా స్ప్రింటర్ ఫైనల్లో అత్యుత్తమ టైమింగ్‌తో తనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు. 23 ఏళ్ల కోల్‌మన్‌ వరుసగా మూడేళ్లనుంచి 100 మీటర్ల పరుగులో అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేస్తూ వస్తున్నాడు.  గతంలో రజతంతో సరిపెట్టుకున్న కోల్‌మాన్‌.. ఈసారి గోల్డ్‌తో బోల్ట్‌ వారసుడిగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: