టీమిండియా సఫారీల మొదటి టెస్ట్‌ మ్యాచ్‌కి వైజాగ్‌ సిద్దమైంది. వచ్చే నెల 2న జరిగే ఈ టెస్ట్‌ మ్యాచ్ కోసం రెండు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే ఉక్కునగరానికి చేరుకున్నారు. స్వదేశంలో తిరుగులేని టీమిండియా సఫారీ టీమ్‌ కు చెక్ పెట్టగలదా..? కోహ్లీసేన తన ఫామ్‌ను కంటిన్యూ చేసి మరో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంటుందా..? రెండు టీమ్స్‌ ఈ సిరీస్‌లో గెలిచి.. టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టాలని భావిస్తున్నాయి.


విండీస్‌ని టెస్ట్‌ సిరీస్‌లో మట్టికరిపించిన టీమిండియా సఫారీ సవాల్‌కు రెడీ అయింది. వచ్చే నెల 2 నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్ట్‌ కోసం వైజాగ్‌కు చేరుకున్నాయి ఇరు జట్లు. వీడీసీఏ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలచి సిరీస్‌ని ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇటీవల ముగిసిన మూడు టీ20 సిరీస్‌ని 11తో సమం చేసిన సఫారీలు.. టెస్ట్‌లలో టఫ్‌ ఇవ్వడానికి రెడీ అయ్యారు.


భారత్ పర్యటనకు ఆఖరిగా 2015లో వచ్చిన దక్షిణాఫ్రికా.. అప్పట్లో టెస్టుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. తాజా పర్యటనలోనూ ఆ జట్టు అంత బలంగా ఏమీ కనిపించడం లేదు. నాలుగేళ్ల క్రితం భారత్‌కి కాస్త పోటీనిచ్చిన సీనియర్ క్రికెటర్లు  రిటైర్మెంట్ ప్రకటించేసి ఉండటంతో.. సఫారీ టీమ్ బలహీనంగా ఉంది. డుప్లెసిస్‌, డికాక్‌, మకరమ్‌ బ్యాటింగ్‌ మీద వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌లో ప్రొటీస్‌ టీమ్‌ స్ట్రాంగ్‌గా ఉంది. రబాడా, ఎంగిడి, ఫిలాండర్‌లతో సఫారీ పేస్‌ బౌలింగ్‌ భీకరంగా ఉంది. స్పిన్ బౌలింగ్‌లో కేశవ్‌ మహారాజ్‌ చెలరేగడానికి సిద్దంగా ఉన్నాడు.


టీమిండియాకి జట్టు కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది. ఓపెనింగ్‌లో రోహిత్‌ను పరిక్షించే అవకాశం ఉంది. పుజారా, కోహ్లీ, రహానే, విహారిలతో టీమిండియా బ్యాటింగ్‌కు తిరుగులేదు. బౌలింగ్‌లో బుమ్రా గాయంతో దూరమవ్వడం టీమిండియాకి పెద్ద లోటు. బుమ్రా ప్లేస్‌లోకి వచ్చిన ఉమేశ్‌ ఎంతమేరకు రాణిస్తాడో వేచి చూడాలి. షమీ, ఇషాంత్‌ పేస్‌ భారం మోయనున్నారు. స్పిన్‌ బౌలింగ్‌లో అశ్విన్‌, జడేజాలు జట్టును ముందుండి నడిపించనున్నారు.


టెస్ట్‌ల్లో ఇరు జట్ల మధ్య మొత్తం  36 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ప్రొటీస్‌దే పై చేయిగా ఉంది. సఫారీ  15 మ్యాచ్‌లు నెగ్గితే.. టీమిండియా 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో పది మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో దూసుకుపోవడానికి ఈ సిరీస్‌ రెండు జట్లకు కీలకం. దీంతో ఈ సిరీస్‌లో నెగ్గి.. ఛాంపియన్‌ షిప్‌ పాయింట్స్‌ టేబుల్‌లో సత్తా చాటాలని రెండు జట్లు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: