విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీం ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.  ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు మంచి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ  తమదైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ సెంచరీతో అందరినీ ఆకర్షించాడు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ బౌండరీలతో మెరుపులు మెరిపించాడు.  అయితే గత కొన్ని రోజులుగా టెస్ట్ మ్యాచుల్లో ఆయన ఆటతీరు సరిగ్గా లేదని, కేవల పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడడానికే పనికివస్తాడని అనేక విమర్శలు వచ్చాయి.


అయితే ఆ విమర్శలన్నింటికీ ఆయన బ్యాటుతో సమాధానం చెప్పాడు. పరిమిత ఓవర్లే కాదు.. టెస్ట్ మ్యాచుల్లో కూడా నిలకడగా ఆడగలడని నిరూపించాడు. రోహిత్ ఆటతీరు చాలా వేగంగా ఉంటుంది. బంతులకి తగినన్ని పరుగులు తీయడం ఆయన అలవాటు. ఈ రోజు మ్యాచ్ లో కూడా ఆయన బౌండరీల వరద పారించాడు. కేవలం 154 బంతుల్లో  9 ఫోర్లు, 4 సిక్సర్లతో  సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ మ్యాచ్ మొదటిరోజే ఇన్ని బౌండరీలు బాదడం చిన్న విషయమేం కాదు. చాలా రోజుల తర్వాత టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ ని రోహిత్ గుర్తు చేశాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు.


రోహిత్ కి భాగస్వామిగా మయాంక్ అగర్వాల్ కూడా తనదైన ఆటతో మెరుపులు మెరిపించాడు. మొత్తానికి వీరిద్దరిని విడగొట్టడానికి  సఫారీలు చాలా కష్టపడుతున్నారు. రోహిత్ కి తోడుగా మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. 183 బంతుల్లో  84పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. తొలి రోజు టీ విరామ సమయానికి టీమిండియా 59.1 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ(115) మయాంక్‌(84) పరుగులతో క్రీజులో ఉన్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: