రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున ఈ భారత క్రికెటర్ మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా అతని ఆటతీరు పైన సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ  నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి అందరి నోళ్ళు మూయించాడు.  ఫోర్లు,సిక్సర్లతో బంతులని బౌండరీలు దాటించాడు. ప్రపంచకప్ లో మెరుపులు మెరిపించిన తర్వాత అతని ఆటతీరు ఏమంత ఆశాజనకంగా కనిపించలేదు.


ప్రపంచ కప్ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో సరిగా ఆడకపోవడం, దాంతో టెస్ట్ సిరీస్ లో అవకాశం కోల్పోవడం అతన్ని బాగా కృంగదీసింది. అదీ గాక దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టిస్ మ్యాచ్ లో కూడా సరిగా ఆడలేకపోయాడు. అలాగే కెప్టెన్ విరాత్ కోహ్లీతో విభేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. వీటన్నింటి మధ్య అతనిపై ఎంతో ఒత్తిడి నెలకొని ఉండేది.  ఈ నేపథ్యంలో అతని ఆటతీరుపైన అందరికీ అనుమానాలు వచ్చాయి.


దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో డకౌట్‌ అయిన రోహిత్‌.. ఓపెనర్‌గా వచ్చి అద్భుతంగా రాణించాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెటర్‌గా ఉన్న అపవాదును తొలిగించుకుంటూ.. టెస్టులకు కావాల్సిన ఓపిక, టెక్నిక్‌తో ఆకట్టుకున్నాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ బంతుల్ని బౌండరీలు దాటిస్తూ 154 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఓపెనర్ గా వచ్చి అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన మొదటి టీం ఇండియా ప్లేయర్ గా రికార్డు సాధించాడు.


పరిమిత ఓవర్లే ఆడగలడు అనే అపవాదును తొలగించుకుని, తనని విమర్శించే వారికి బ్యాట్ ద్వారానే సమాధానం ఇచ్చాడు. ఆట ముగిసే సమయానికి ఇంకా క్రీజులోనే ఉన్న రోహిత్ రెండో రోజు ఇంకా ఎన్ని మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: