భారత క్రికెట్ టీంలో ఆల్ రౌండర్లు అనగానే గుర్తుకొచ్చే పేర్లు రవీంద్ర జడేజా, హార్థిక్ పాండ్యా. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో జడేజా తన అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే హార్ధిక్ పాండ్య ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గత కొంత కాలంగా వెన్నుగాయంతో బాధపడుతున్న కారణంగా లండన్ లో సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ చేయించుకున్న తర్వాత విశ్రాంతి అవసరమని కొన్ని రోజులు క్రికెట్ కి సెలవిచ్చాడు.


అందువల్ల హార్థిక్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కి దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అయింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెస్ చెప్తూ ఒక వీడియో పెట్టాడు. అయితే ఆ వీడియోలో జహీర్ ఖాన్ బౌలింగ్ లో హార్థిక్ పాండ్య బౌండరీ బాదుతున్నాడు. 


జహీర్ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసు. మరి అలాంటి ఆటగాడికి హార్థిక్ ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేయడం జహీర్ అభిమానులని నొప్పించింది. ఇది జహీర్ ఖాన్ ని అవమానించడమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పెట్టినప్పటి నుండి హార్థిక్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సీనియర్ ఆటగాడయిన జహీర్ ఖాన్ కి నువ్విచ్చే గౌరవం ఇదేనా అంటూ మండి పడుతున్నారు.


సీనియర్లని గౌరవించకపోవడం అతనికి అహంకారాన్ని తెలియజేస్తుందని అంటున్నారు. ఇప్పటికే మహిళల విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడని విమర్శలు ఎదుర్కొన్న హార్థిక్ మరోసారి విమర్శల పాలవడం అతని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. జహీర్ ఖాన్ ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. మరి ఈ విషయం పై హార్థిక్ పాండ్య ఏ విధంగా స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: