టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ సారథి సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా పంచుకుంది. భారత్ తరఫున గంగూలీ 2000 నుంచి 2005 మధ్యన 49 టెస్టులకు సారథ్యం వహించాడు. ఇప్పుడు విరాట్ ఆ రికార్డును బద్ధలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండో టెస్టు అతడు నాయకత్వం వహిస్తున్న 50వ మ్యాచ్. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు కెప్టెన్సీ చేసిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే.


2008 నుంచి 2014 మధ్యన అతడు 60 టెస్టులకు సారథ్యం వహించాడు. మరో 10 మ్యాచులు ఆడితే విరాట్ ఈ రికార్డునూ అధిగమిస్తాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం మైదానంలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీకి సారథిగా ఇది 50 వ టెస్టు. అభినందనలు కెప్టెన్  అని బీసీసీఐ ఓ వీడియోను ట్వీట్ చేసింది. సారథిగా ఇప్పటికే కోహ్లీ చాలా రికార్డులు తిరగరాశాడు. భారత్ తరఫున అత్యంత విజయవంతమైన నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. అత్యధిక విజయాల శాతం (58%) అతడిదే. 2014 నుంచి టీమిండియాను నడిపిస్తూ 29 టెస్టుల్లో జట్టుకు విజయాలు అందించాడు.


ధోనీ (60 మ్యాచుల్లో 27 విజయాలు)ని అధిగమించాడు. గంగూలీ 21 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇకపోతే టెస్టుల్లో భారత్ జట్టుకి ఎక్కువ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. మహేంద్రసింగ్ ధోనీ 60 టెస్టుల్లో నెం.1 స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి (50*), సౌరవ్ గంగూలీ (49), సునీల్ గవాస్కర్ (47), మహ్మద్ అజహరుద్దీన్ (47), పటౌడి (40) టాప్-6లో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. పుణె టెస్టు మ్యాచ్‌ సోమవారం ముగియనుండగా.. ఆ తర్వాత రాంచీ వేదికగా ఈ నెల 19 నుంచి మూడో టెస్టు జరగనుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: