హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ తెచ్చుకొని తొలి టెస్టులోనే రెండు సెంచరీలతో వీరవిహారం చేసిన నేపథ్యంలో.. రోహిత్ ఓపెనర్‌గా రావాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయమని గంభీర్ అన్నారు.

 

అవి టెస్టులా, వన్డేలా.. అన్నది కాకుండా రోహిత్ తన సహజ ఆటతీరును కొనసాగించాలని చెప్పారు. ఈ సందర్భంగా తాను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని, ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర ఆటగాడు రోహిత్ శర్మ అని అన్నారు. ఈ మాట చెప్పడానికి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్యానించారు.

 

సెహ్వాగ్ లాగే దూకుడుతో రోహిత్ కూడా ఆడాలని తాను ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. కాగా, రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ‘వచ్చిన అవకాశాన్ని రోహిత్‌శర్మ సద్వినియోగం చేసుకున్నాడు. తనకున్న అనుభవంతో తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు.

 

రోహిత్‌ ఓపెనర్‌గా ఉండటం జట్టుకు లాభిస్తుంది. కమాన్! అతడికి బ్రేక్ ఇవ్వండి. అద్భుతంగా ఆడుతున్నాడు. బ్యాటింగ్ టాపార్డర్‌లో ఎంజాయ్ చేయనివ్వండి. రోహిత్ నుంచి మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎలాంటి ఆటనైతే అతడిలో చూశామో టెస్టుల్లోనూ అదే ఆటను కొనసాగించాలని కోరుకుంటున్నాం.’ అని తెలిపాడు.

 

అయితే, రోహిత్‌ టెస్టుల్లో ఓపెనర్‌గా ఎలా ఆడతాడనే దానిపైనే అందరూ ఎక్కువ ఫోకస్‌ పెట్టారని, దీంతో రోహిత్ శర్మ ఒత్తిడి గురయ్యే అవకాశం ఉందని అన్నాడు. అందువల్ల విశ్లేషకులు, మీడియా రోహిత్‌పై ఫోకస్‌ తగ్గించుకోవాలని కోహ్లీ విజ్ఞప్తి చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: