సొంత గడ్డపై తమకు ఎదురులేదని టీమ్‌ఇండియా మరోసారి నిరూపించింది. గత రెండేళ్లుగా స్వదేశంలో పర్యటించిన ఏ అగ్రశ్రేణి జట్టు కూడా భారత్‌కు కనీస పోటీ ఇవ్వలేదు. తాజాగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్‌ వరుసగా రెండింట్లో గెలుపొంది సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకో టెస్టు మిగిలుండగానే సిరీస్‌ను చేజిక్కించుకోవడం విశేషం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో కోహ్లీసేన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.


పుణె టెస్టులో ఆల్‌రౌండ్‌ షోతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కోహ్లీసేన సఫారీలపై 137 ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ ప్రత్యర్థికి కొండత లక్ష్యాన్ని నిర్దేశించగా.. సౌతాఫ్రికాను రెండు సార్లు బౌలర్లు కుప్పకూల్చి భారత్‌కు గొప్ప విజయాన్నందించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును డబుల్‌ సెంచరీ హీరో విరాట్‌ కోహ్లీ(254) అందుకున్నాడు. ఇకపోతే మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం ఫాలోఆన్ ఆడిన సఫారీలు మూడో సెషన్ ఆరంభంలోనే 189 పరుగులకి ఆలౌటయ్యారు. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్సులో 275 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.


రెండో ఇన్నింగ్సులోనూ సఫారీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలను ఆదిలోనే ఇషాంత్ శర్మ దారుణంగా దెబ్బతీశాడు. ఓపెనర్‌ మార్‌క్రామ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లెవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. ఈరోజు సఫారీలను ఫాలోఆన్ ఆడించి.. వారిని 189 పరుగులకే కుప్పకూల్చింది.


ఇక సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్‌ ఎల్గర్‌ (48), బావుమా (38), ఫిలాండర్‌ (37), కేశవ్‌ మహరాజ్‌ (22) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ కేవలం సింగిల్‌ పరుగుకే పరిమితమయ్యారు. పిచ్‌ స్పందిస్తున్న తీరును అర్థం చేసుకొని ఆడటంలో సఫారీలు విఫలమయ్యారు. మరోవైపు పేస్‌, స్పిన్‌తో భారత బౌలర్లు విరుచుకుపడటంతో ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. ఉమేశ్‌ యాదవ్‌ (3), రవీంద్ర జడేజా (3), అశ్విన్‌( 2)  ప్రొటీస్‌ను కుప్పకూల్చారు. బౌలర్ల మెరుపు బంతులకు సౌతాఫ్రికా 67.2 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది...

మరింత సమాచారం తెలుసుకోండి: