డీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సమయంలో భారత్‌–శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌లో దీనిని ఒకసారి ఉపయోగించారు. అయితే నిర్ణయాలు అన్నీ తమకు ప్రతికూలంగా వెళ్లడంతో ఇకపై వాడేది లేదన్న బీసీసీఐ... డీఆర్‌ఎస్‌ లోపాలభరితం అని తేల్చేసింది.


ప్రపంచ క్రికెట్‌లో గులాబీ బంతితో ‘డే అండ్‌ నైట్‌’ టెస్టుల నిర్వహణ గురించి చర్చ జరుగుతున్న సమయంలో భారత్‌ తమ దేశవాళీ క్రికెట్‌లో వాడి చూడాలని భావించింది. 2015 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య అడిలైడ్‌లో తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ జరగ్గా... 2016 సీజన్‌ దులీప్‌ ట్రోఫీలో భారత్‌ మొదటిసారి గులాబీ బంతిని వాడింది. ఆ తర్వాత మరో రెండు సీజన్లు కూడా డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లను కొనసాగిస్తూ ఫ్లడ్‌లైట్లలో ఆటను నిర్వహించింది. దేశవాళీలో సక్సెస్‌ అయితే టెస్టు క్రికెట్‌లో ప్రయత్నించవచ్చని భావించింది.


గులాబీ బంతి స్పందించే తీరును గురించి కూడా మన ప్రధాన ఆటగాళ్లకు అవగాహనే రాలేదు. కోహ్లి, పుజారాలాంటి బ్యాట్స్‌మెన్‌... బుమ్రా, అశ్విన్‌లాంటి బౌలర్లు ఒక్కసారైనా వాడి ఉంటే ముందడుగు పడేదేమో. ఒక్క మ్యాచ్‌లో కూడా గులాబీ బంతిని వాడకుండా నేరుగా టెస్టు బరిలోకి దిగడం సాధ్యం కాదని టీమిండియా ఆ తర్వాత ఆ ఆలోచనను పూర్తిగా పక్కన పడేసింది.  2019 దులీప్‌ ట్రోఫీ సమయంలో బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ సారి లీగ్‌ మ్యాచ్‌లన్నీ పాత పద్ధతిలోనే ఎర్ర బంతితోనే జరుగుతాయని, ఫైనల్‌ మాత్రం పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌గా ఉంటుందని ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా ‘పింక్‌’ కాకుండా సాంప్రదాయ ఎర్ర బంతితోనే ఆడించింది.


విదేశీ పర్యటనల్లో డే అండ్‌ టెస్టు గురించి ఇప్పుడే చెప్పలేం కానీ గంగూలీ స్వదేశంలోనైనా ఒక మ్యాచ్‌ ఆడించాలని పట్టుదలగా ఉన్నాడు. బహిరంగంగా చెప్పకపోయినా బోర్డు అధ్యక్షుడి వ్యాఖ్యలను బట్టి చూస్తే రాబోయే బంగ్లాదేశ్‌ సిరీస్‌లోనే ఒక టెస్టు విషయంలో అతను ఈ ఆలోచనతో ఉన్నట్లు అంతర్గత సమాచారం.బహుశా తన సొంత మైదానం కోల్‌కతాలో జరిగే రెండో టెస్టే పింక్‌ బాల్‌ మ్యాచ్‌ కావచ్చని కూడా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: