తెలంగాణకు చెందిన ఓ క్రికెటర్ ఆకాశామే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో వీర‌విహారం చేసేసి ఏకంగా ట్ర‌ఫుల్ సెంచ‌రీ చేసేశాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్‌ రెండు రోజుల లీగ్‌లో బుధ‌వారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, డ‌బ్ల్యూఎంసీసీ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ బ్యాట్స్‌మన్‌ జి. గణేశ్‌ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) ట్రిపుల్‌ సెంచరీతో కదం తొక్కాడు.


ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్లు వేసిన బంతులు వేసిన‌ట్టు ఎడాపెడా బౌండ‌రీల‌కు పంపాడు. గ‌ణేశ్ దూకుడుతో డ‌బ్ల్యూఎంసీసీ జ‌ట్టు బౌల‌ర్లు ఒకానొక ద‌శ‌లో చేష్ట‌లుడిగి చూస్తుండిపోయారు. గ‌ణేశ్ వీర‌విహారంతో  మహబూబ్‌నగర్‌ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన మహబూబ్‌నగర్‌ జట్టు 79.4 ఓవర్లలో 658 పరుగుల భారీస్కోరు సాధించింది. గణేశ్‌ విజృంభణకు తోడు అబిద్‌ (69 బంతుల్లో 110; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సెంచరీతో చెలరేగాడు.


ఇక గ‌ణేశ్ మెరుపు బ్యాటింగ్‌కు తోడు పి. హర్షవర్ధన్‌ (49; 9 ఫోర్లు), కేశవులు (78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా వీర‌విహారం చేయ‌డంతో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఏకంగా 658 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లలో టైటస్‌ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. 659 ప‌రుగుల భారీ స్కోరుతో బ్యాటింగ్ చేప‌ట్టిన డబ్ల్యూఎంసీసీ తడబడింది. ఆట ఆరంభం నుంచే త‌డ‌బ‌డిన ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు  49.4 ఓవర్లలో కేవలం 175 పరుగులకే ఆలౌట‌య్యారు. అక్షయ్‌ (28), హర్ష (28), శరత్‌ (28) మాత్ర‌మే ఓ మోస్త‌రుగా రెండంకెల స్కోరు సాధించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: