క్రికెట్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది సచిన్ టెండూల్కర్. ముష్తాక్ మొహమ్మద్, ఆకిబ్ జావేద్‌ల తర్వాత మూడో పిన్న వయస్కుడిగా సచిన్  అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి అరంగేట్రం చేశాడు. 1989 నవంబర్ 15న కరాచి వేదికగా పాకిస్థాన్‌తో తొలి టెస్టు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ అతి తక్కువ కాలంలోనే క్రికెట్ దేవుడిగా ఎదగడం జరిగింది. 24 ఏళ్ల తన క్రికెట్ చరిత్రలో ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు బద్దలు కొడుతూ.. భారత క్రికెట్‌లో ఎన్నో మైలు రాళ్లను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరూ సాధించలేనటువంటి రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్.. క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా 30 ఏళ్లు అవుతుంది.


 సచిన్ బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా పార్ట్‌టైం బౌలర్‌గా, టీమిండియా కెప్టెన్‌గా కీలక పాత్రలు పోషించాడు. తన బ్యాటింగ్‌ ప్రతిభతో భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాందికున్నాడు మాస్టర్ బ్లాస్టర్. అతడి చిరకాల స్వప్నం 2011 ప్రపంచకప్‌ను ముద్దాడిన తర్వాత 2012 డిసెంబర్ 23న వన్డే క్రికెట్‌కు దూరమయ్యాడు. 2013 అక్టోంబర్ 10న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది.


 పదహారేళ్ల లేత ప్రాయంలో భారత జట్టులో అడుగుపెట్టిన క్రికెట్ దేవుడు.. అంత గొప్ప బ్యాట్స్‌మెన్ అవుతాడని మొదట ఎవరూ ఊహించలేదు. తొలి పర్యటనలోనే వసీం అక్రమ్, ఇమ్రాన్‌ఖాన్, వకార్ యూనిస్ లాంటి దిగ్గజాలను ఎదుర్కొని 35.83 సగటుతో 215 పరుగులు చేశారు. నాలుగో టెస్టులో యూనిస్ బౌలింగ్‌లో గాయపడి రక్తం కారుతున్న, అలాగే బ్యాటింగ్ చేసి అర్ధ శతకం సాధించాడు. పాక్ బౌలర్లు బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నా ఏమాత్రం భయపడకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు.  ఆ పర్యటన టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అయితే, సచిన్ తన బ్యాటింగ్‌తో అందరీని ఆకట్టుకొని వరుసగా అవకాశాలు సాధించాడు. 


సచిన్ టెండూల్కర్ మొత్తం 200  టెస్టులు, 463 వన్డేలు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ అంతర్జాతీయ కెరీర్‌లో 34,347 పరుగులు చేశాడు. అలాగే 100 అంతర్జాతీయ శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర పుటల్లో నిలిచాడు సచిన్ టెండూల్కర్.


మరింత సమాచారం తెలుసుకోండి: