టీమిండియా ప్లేయర్‌ రాయుడు కెరీర్‌ మరోసారి చిక్కుల్లో పడిందా? రాయుడు చేసిన ట్వీట్‌ అతని కెరీర్‌కే అడ్డంకి మారిందా..?  కొన్ని రోజుల క్రితం ఆవేశంగా రిటర్మైంట్‌ ప్రకటించి.. అంతే వేగంగా వెనక్కి తీసుకున్న అంబటి... తాజాగా  హెచ్.సి.ఎ అవినీతిపై  చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. 

 

టీమిండియా బ్యాట్స్‌మెన్‌... హైదరాబాదీ అంబటి రాయుడు కెరీర్‌ మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. వరల్డ్‌ కప్‌లో జట్టులో చోటు దక్కకపోవడంతో ఆవేశంలో రిటైర్మెంట్‌ ప్రకటించి... కొన్ని రోజుల్లోనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. మరోసారి అతడు చేసిన ఓ ట్వీట్‌ తన కెరీర్‌కే ఎండ్‌ కార్డ్‌లా మారింది.

 

మంత్రి కేటీఆర్‌కు అంబటి రాయుడు ఓ ట్వీట్‌ చేశాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనీ.. ఏసీబీ కేసుల్లో ఇరుక్కున్న వాళ్లు హెచ్‌సీఏ పదవుల్లో ఉన్నారనీ.. చొరవచూపి చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా కోరాడు. కేటీఆర్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత హెచ్.సి.ఎ  ప్రెసిడెంట్‌ అజాహర్‌ రాయుడి ట్వీట్‌పై ఘాటుగా స్పందించాడు. అజహార్‌తో పాటు మిగతా హెచ్‌సీఏ పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు రాయుడు.

 

అజార్‌ వ్యాఖ్యల్ని చూసిన అంబటి వెంటనే తన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. హెచ్‌సీఏ అవినీతిపై కేటీఆర్‌కు తాను చేసిన ట్వీట్‌ను వ్యక్తిగతంగా తీసుకోవద్దనీ.. హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో మనిద్దరికీ తెలుసన్నాడు అంబటి. మీరు కుట్రలకు దూరంగా ఉంటూ... నిస్పక్షపాతంగా వ్యవహరిస్తారని నమ్ముతున్నాననీ.. హైదరాబాద్‌ క్రికెట్‌ను ప్రక్షాళన చేసి, భవిష్యత్‌ క్రికెటర్లను కాపాడతారని ఆశిస్తున్నా అని అజార్‌కు ట్వీట్‌ చేశాడు అంబటి. అజార్‌ దృష్టిలో అంబటి దిద్దుబాటు ట్వీట్లే చేసినా.. హెచ్‌సీఏ పెద్దలు మాత్రం అతడిపై గుర్రుగా ఉన్నారు. కెరీర్‌ ఆరంభం నుంచీ ఇదే తరహాలో ముక్కుసూటిగా వెళ్లి సమస్యలు తెచ్చుకున్నాడు.  

 

ఈ ఏడాది వరల్డ్‌ కప్‌కి సెలక్ట్‌ చేయక పోవడంతో ..టీమిండియా  సెలక్టర్లపై త్రీడీ గ్లాసెస్‌ ట్వీట్‌ పెట్టి విమర్శలు ఎదుర్కొన్నాడు. సెలక్టర్ల కోపం కారణంగా ఇప్పటికే  జట్టుకు దూరమైన అంబటి... తాజా ట్వీట్‌తో హెచ్‌సీఏ పెద్దలకూ కోపం తెప్పించి.. తన కెరీర్‌నే ప్రమాదపు అంచున నిలబెట్టాడు. ఇక రాయుడికి మిగిలింది ఐపీఎల్‌ మాత్రమే. ఇక  వచ్చే ఏడాది ఐపీఎల్‌ కూడా ఇదే చివరి ఛాన్స్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: