ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ ఓ సినిమాలో రవితేజ పలికిన డైలాగ్‌ ఇది.  కానీ ఓ క్రికెటర్‌కు అపారమైన టాలెంట్‌ ఉన్నా... ఆ ఛాన్స్‌ మాత్రం  దక్కడం లేదు. ఊహించని సెలక్టర్ల వరుస బౌన్సర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ యంగ్‌ క్రికెటర్‌ ఎవరో కాదు సంజు శామ్సన్‌.

 

సంజూ శామ్సన్‌ 2015లోనే టీమిండియాకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఓ ఇంటర్నేషనల్‌ టీ 20 కూడా ఆడాడు. 7వ స్ధానంలో దిగి 19 రన్స్‌ చేశాడు. అంతే ఆ తర్వాత అతడిపై సెలక్టర్లు ఎందుకు వేటు వేశారో ఎవ్వరికీ అర్ధం కాలేదు. అప్పటి నుంచి  తన కెరీర్‌లో ఎత్తుపల్లాలెన్నో చవిచూశాడు. సూపర్‌ క్రికెటర్‌గా ఎదిగాడు. కేరళ రంజీ జట్టు.. ఐపీఎల్‌లో రాజస్ధాన్‌ రాయల్స్‌లో కీలక సభ్యుడిగా మారాడు. కొన్నేళ్లుగా రంజీలు, ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న సంజుపై చాలామందికి భారీ అంచనాలే ఉన్నాయి. అతడి ఆటకు మాజీ క్రికెటర్లు ఫిదా అయ్యారు. కొందరు మాజీలైతే ఏకంగా ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ శాంసనే ఉన్నాడు. రెండేళ్లుగా దేశవాళీల్లో అతడి ప్రదర్శన అత్యంత నిలకడగా ఉంది. భారత్‌-ఏ తరఫున అద్భుతంగా రాణించాడు. 

 

విజయ్‌ హజారే ట్రోఫిలో డబుల్‌ సెంచరీ బాది సంచలనం సృష్టించడంతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కనీసం ఏదో ఒక మ్యాచ్‌లోనైనా అవకాశం దక్కుతుందని ఊహించాడు. కానీ అతడి ఆశలు అడియాసలే అయ్యాయి. డ్రింక్స్‌ మాత్రమే అందించాడు. బంగ్లాదేశ్‌తో ఓడిన తొలి మ్యాచ్‌లో శివం దూబె అరంగేట్రం చేశాడు. ఓడిన జట్టుతోనే గెలవాలన్న కసితో రెండో టీ20లో మార్పుల్లేవు. ఆఖరి పోరులోనూ తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. కనీసం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కైనా ఎంపిక చేస్తారేమోనని అనుకుంటే అదీ లేదు.

 

ఎవరికైనా సరే ఓ అవకాశం ఇచ్చాకే వేటు వేయడం కనీస సంప్రదాయం. మరి సంజు శాంసన్‌ విషయంలో అదీ జరగలేదు. పదేపదే విఫలమవుతున్న రిషభ్‌ పంత్‌పైనే సెలక్టర్లు విశ్వాసం ఉంచారు. అతడు అద్భుతమైన ఆటగాడే. పరుగుల వేట మొదలుపెడితే ఆపడం ఎవరీ తరం కాదు. కానీ ప్రస్తుతం షాట్ల ఎంపికతో తరుచుగా ఫెయిల్‌ అవుతున్నాడు. స్ట్రైక్‌ ఇవ్వాలా, బాదాలా అన్న గందరగోళంలో ఉంటున్నా రిషబ్‌ పంత్‌కు  ఎక్కువ అవకాశాలే ఇచ్చారు. కానీ సంజూ విషయంలో సెలక్టర్లు చిన్నచూపు చూస్తున్నారు.

 

సంజూ శాంసన్‌ విషయంలో సెలక్టర్లు తప్పు చేశారని వారిపై మండిపడ్డాడు భజ్జీ. ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ ప్యానల్‌ను మార్చేయాలని  హర్భజన్‌ సింగ్‌ డిమాండ్‌ చేశాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కల్పించుకోవాలన్నాడు. అదే విధంగా ఈ యువ క్రికెటర్‌కు మాజీల నుంచి మద్దతు లభిస్తుంది. అవకాశం ఇవ్వకుండానే సంజు శాంసన్‌ను తొలగించిన సెలక్టర్లపై ఇప్పుడు నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: