భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి గురించి ఎక్కువగా ట్రోల్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇది ఒక అలవాటుగా మారిపోయింది. రవిశాస్త్రికి కోచ్ గా కొనసాగే ప్రతిభ లేదని, కేవలం విరాట్ భజన చేయడం వల్లే అతడు కోచ్ గా కొనసాగుతున్నాడని విమర్శిస్తుంటారు. దానికి తోడు రవి శాస్త్రి ఒకానొక సమయంలో స్టేడియంలో నిద్రపోతూ కెమెరా కంటికి చిక్కడంతో విమర్శల పర్వం మరింత ఎక్కువైంది. అప్పటి నుండి ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

 

రవిశాస్త్రి తాగుడు మీద కూడా ట్రోల్స్ చేస్తుంటారు. మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ పుట్టినరోజు నాడు రవి శాస్త్రిని ఉద్దేశించి ఎంత ట్రోలింగ్ చేశారో తెలిసిందే. అయితే ఈ విషయాలని రవిశాస్త్రి కూడా సీరియస్ గా తీసుకోడు. ప్రతీ సారి ఏం స్పందించాలని అనుకుంటాడో మరేంటో గానీ ఈ విషయమై ఇప్పటి వరకు స్పందించింది లేదు. అయితే తాజాగా రవిశాస్త్రిని ట్రోల్ చేస్తున్న వారి మీద భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లీ సీరియస్ అయ్యారు.

 

రవిశాస్త్రిని విమర్శించే వాళ్ల వ్యాఖ్యల మీద స్పందిందిన కోహ్లీ, రవిశాస్త్రి కెరీర్ ఆరంభంలో పదో స్థానంలో బ్యాటింగ్ చేశాడని.. అక్కడి నుంచి కష్టపడి ఎదిగి ఓపెనర్ కూడా అయ్యాడని.. ఆ స్థానంలో తన యావరేజ్ 41కి పైనే ఉందని.. సుదీర్ఘమైన కెరీర్‌ ఉన్న ఇలాంటి మాజీ ఆటగాడిని ఎలా విమర్శిస్తారని కోహ్లి ప్రశ్నించాడు. ఇంటిదగ్గర పనీ పాటా లేకుండా ఖాళీగా ఉండేవాళ్లే రవిశాస్త్రిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తుంటారని.. దీని వెనుక ఒక ఎజెండా ఉందని అన్నాడు.

 

రవిశాస్త్రిని విమర్శించేవాళ్లు ముందు ఆయన సాధించింది తాము సాధించి చూపించాలని.. అవన్నీ సాధించగల ధైర్యం అయినా ఉందేమో ఆలోచించుకోవాలని ట్రోలింగ్స్ చేసే వారికి గట్టిగా హెచ్చరించాడు. ఇంకా రవిశాస్త్రి ఎప్పుడూ జట్టు గురించే ఆలోచిస్తాడనీ, అలాంటి కోచ్ ఉండటం మా అదృష్టమనీ కోహ్లీ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: