హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈరోజు మీడియాతో మాట్లాడిన సిమన్స్ బౌలర్లకి కొన్ని సూచనలు చేశాడు.భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ చూసి కంగారుపడొద్దని వెస్టిండీస్ బౌలర్లలో ఆ టీమ్ కోచ్ ఫిల్ సిమన్స్ ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. కోహ్లీని ఔట్ చేయడానికి తమ వద్ద వ్యూహాలు ఉన్నాయని చెప్పుకొచ్చిన సిమన్స్.. వాటితో భారత కెప్టెన్‌ని కట్టడి చేయగలమని మాత్రం ధీమా వ్యక్తం చేయలేకపోయాడు. 

 

భారత్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం నుంచి మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన డే/నైట్ టెస్టులో శతకం బాదిన విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ‘సిరీస్‌లో వెస్టిండీస్ ముందు ఉన్నది ఒకటే దారి. అది విరాట్ కోహ్లీకి కనీసం శతకం సమర్పించుకుని.. టీమ్‌లోని మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేయడం. మొదట వెస్టిండీస్ బౌలర్లు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసి భయపడకుండా.. వ్యూహాలకి అనుగుణంగా బౌలింగ్ చేయాలి. మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఎవరికీ తెలీదు. అయినప్పటికీ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు వ్యూహాలు రచించడం చాలా కష్టం’ అని సిమన్స్ వెల్లడించాడు. 
 
తొలి టీ20కి ఉప్పల్ స్టేడియం ఇప్పటికే సిద్ధమవగా.. పిచ్‌ని బ్యాటింగ్‌కి అనుకూలంగా క్యూరేటర్ రూపొందించినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీకి ఈ స్టేడియంలో మెరుగైన రికార్డ్ ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు వెస్టిండీస్ బౌలర్ల దృష్టి అతనిపై పడింది. ముఖ్యంగా సిరీస్ ఆరంభం నుంచి కోహ్లీని కట్టడి చేయడం ద్వారా.. భారత్‌‌ని ఒత్తిడిలోకి నెట్టాలని ఆ జట్టు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

అయితే మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఆసక్తి కూడా మొదలైంది ,హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వర్షం కురవగా.. మంగళ, బుధవారం కూడా వర్షం పడే సూచనలు కనిపించాయి. అయితే.. శుక్రవారం.. అదీ సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్‌ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7 గంటలకి ప్రారంభంకానుండగా.. ఒకవేళ వర్షం కురిస్తే ఓవర్లని కుదించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: