భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల గాయాల కారణంగా, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. 2019 మొత్తం వీటితోనే గడిపిన ధావన్.. పలు సందర్భాల్లో జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి  ఫామ్‌లోకి వచ్చాడు. వచ్చేనెలలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుకి ధావన్ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే.   

 

రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో సత్తాచాటాడు. ఎంతో ఓపికగా ఆడిన ధావన్.. 19 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. తొలిరోజు ఆటముగిసేసరికి 269/6 చేసింది. ఢిల్లీ టీమ్‌లో గబ్బర్ మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాదీ బౌలర్లలో మెహదీ హసన్‌‌కు మూడు, మహ్మద్ సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. 

 

వచ్చేనెలలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌ కు ముందు ఫామ్‌లోకి రావడంపై ధావన్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. రాబోయే సీజన్‌లో గబ్బర్ పరుగుల పండుగ చేయడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ సిరీస్ కు దూరం కావడంతో తన స్థానంలో ధావన్ సత్తాచాటుతాడని ఆశిస్తున్నారు. మరోవైపు 2019 ఏడాది ధావన్‌కు మిశ్రమంగా గడిచింది. సూపర్ ఫామ్‌లో ఉండగా వరల్డ్‌కప్‌లో తను గాయపడ్డాడు. దీంతో ఆ టోర్నీకి తాను దూరమయ్యాడు. 
 
ఇక జాతీయజట్టులో స్థానం కోల్పోయాక దేశవాళీల్లో నిరూపించుకునేందుకు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గబ్బర్ బరిలోకి దిగాడు. అయితే అక్కడ అతనిని దురదృష్టం వెంటాడింది. మాకాలి గాయం తో వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన వన్డే, టీ20 టోర్నీలకు తను దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన ధావన్.. రంజీల్లో సెంచరీ కొట్టి ఫామ్‌లోకి రావడం శుభపరిణామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: