ప్రత్యర్థితో పోల్చుకుంటే అనుభవం తక్కువ.. ఆడుతోంది రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌తో. అందులోనూ తొలి సెట్‌ కోల్పోయింది. అయినా ఆ అమ్మాయి తగ్గలేదు. గెలిచేదాకా ఆగలేదు.నైపుణ్యానికి దూకుడును జోడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫస్ట్ టైమ్‌  గ్రాండ్‌స్లామ్‌ విజేతగా నిలిచింది. ఆ అమ్మాయే అమెరికా నయా సంచలనం సోఫియా కెనిన్‌.

 

చివరిదాకా గెలవాలనే కసి ఉంటే... ప్రత్యర్థి ఏ స్థాయి వారైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... ఛాంపియన్‌గా అవతరించవచ్చొని అమెరికా యువతార సోఫియా కెనిన్‌ నిరూపించింది. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్నప్పటికీ... తొలి సెట్‌ చేజార్చుకున్నప్పటికీ... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చివరిదాకా పోరాడి గ్రాండ్‌ విజేతగా నిలిచింది సోఫియా కెనిన్‌. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో 14 వ సీడ్‌ సోఫియా కెనిన్‌ 4-6, 6-2,6-2 తో మాజీ నెంబర్‌వన్‌ ప్లేయర్‌ ముగురుజాపై విజయం సాధించింది. ఫైనల్‌ చేరే క్రమంలో తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ ఫైనల్‌లో ఈ అమెరికా భామ ఆడిన ఆట వారెవ్వా అనిపించింది. 

 

మొదటి సెట్‌లో ముగురుజా 4-2 ఆధిక్యం ప్రదర్శించినా..ఆ తర్వాత సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కెనిన్‌ 4-4తో సమం చేసింది. కానీ 5-4 వద్ద కెనిన్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ముగురుజా ఆధిక్యాన్ని కాపాడుకొని తొలిసెట్‌ సొంతం చేసుకుంది. సెట్‌ కోల్పోయినా దూకుడు తగ్గని కెనిన్‌.. తన పవర్‌ గేమ్‌కు బేస్‌లైన్‌ ఆటను జోడించి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. అదేఊపులో మిగతా రెండుసెట్లను అలవోకగా నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో రెండు ఏస్‌లు సంధించిన కెనిన్‌.. 28 విన్నింగ్‌ షాట్లు ఆడింది. విజేతగా నిలిచిన సోఫియాకు  19 కోట్ల 71 లక్షల రూపాయలు ప్రైజ్‌మనీగా దక్కింది.  సోఫియా కెనిన్‌ రష్యాలో జన్మించింది. ఆమె పుట్టిన కొద్దినెలలకే తల్లిదండ్రులు అలెగ్జాండర్‌, లెనా కనిన్‌ అమెరికా వలస వచ్చారు. ట్యాక్సీ డ్రైవర్‌ అయిన అలెగ్జాండర్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కూడా. తండ్రిని చూసి స్ఫూర్తి పొందిన సోఫియాకు ఆయనే తొలి గురువు. ఐదేళ్లకే టెన్నిస్‌ రాకెట్‌ చేతబట్టి కెనిన్‌ మెరుగైన శిక్షణ కోసం న్యూయార్క్‌ నుంచి ఫ్లోరిడా చేరింది. 

 

శిక్షణ సమయంలోనే అమెరికన్‌ స్టార్లు రాడిక్‌, మెకెన్రో, వీనస్‌ విలియమ్స్‌లతో కలిసి ఆడింది. ఏడేళ్ల వయస్సులో యునైటెడ్‌ స్టేట్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ బాలికల అండర్‌-10 కేటగిరీలో సత్తా చాటిన కెనిన్‌.. ఆ విభాగంలో ఫ్లోరిడా రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. 2013లో 14 ఏళ్ల వయస్సులో ఐటీఎఫ్‌ సర్క్యూట్‌లో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించింది. ఇప్పటివరకు రెండు ఐటీఎఫ్‌, రెండు డబ్ల్యూటీఏ టైటిల్స్‌ గెలిచింది. 2015లో యూఎస్‌ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రం చేసింది. ఇప్పుడు తొలి మేజర్‌ టైటిల్‌ను అందుకుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన రెండో పిన్న వయస్కురాలిగా షరపోవా తర్వాత కెవిన్‌ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: