క్రీడలలో పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతున్న సమయంలో ఆటగాళ్ళు భావోద్వేగాలు కి గురవడం సహజం. దాంతో వారు తరచుగా ఒకరినొకరు ద్వేషించుకొంటూ చురకలంటించుకుంటూ ఉంటారు. దీనినే క్రికెట్ పరిభాషలో స్లెడ్జింగ్ అంటారు. అయితే జెంటిల్మెన్ గేమ్ గా పిలువబడే క్రికెట్ లో స్లెడ్జింగ్ ఏమాత్రం మితిమీరికూడదు సరికదా ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించకపోతే భారీ జరిమానాలు మరియు ఊహించని పరిణామాలు తప్పవు. అదీ కాకుండా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో సమన్వయం పాటించడం తప్పనిసరి.

 

అయితే నిన్న జరిగిన పురుషుల అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ లో  భారత్ మరియు బంగ్లాదేశ్ ఆటగాళ్ళు మాత్రం కచ్చితంగా హద్దుమీరారు అనే చెప్పాలి. మ్యాచ్ ఫలితం విషయానికి వస్తే మొదటిసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన బంగ్లాదేశ్ అనూహ్యరీతిలో నాలుగుసార్లు ఛాంపియన్ అయిన భారత్ ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 177 పరుగులకే ఆలౌట్ కాగా బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది. భారత జట్టు ఎంత పోరాడినా బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ మంచి సహనం, ఓర్పు ప్రదర్శించి తమ జట్టుకు ప్రపంచ కప్ ను అందించాడు.

 

అయితే మ్యాచ్ మొదలైన తొలి ఓవర్ నుంచే బంగ్లాదేశ్ ఆటగాళ్లు భారత్ ఆటగాళ్లు కవ్వించే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ ఆసాంతం భారత బ్యాట్స్ మెన్ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి అనడం, దూషించడం లేదా సైగలు చేయడం వంటివి చేస్తూనే ఉన్నారు. అంపైర్లు హెచ్చరించినా కూడా వారి తీర్పులో ఎటువంటి మార్పూ రాలేదు. భారత్ ఫీల్డింగ్ కు వచ్చినప్పుడు భారత ఆటగాళ్లు కూడా అలాగే ప్రవర్తించగా మ్యాచ్ జరిగినంత సేపు అంపైర్లు పలుమార్లు రెండు దేశాల ఆటగాళ్లను వారిస్తూనే ఉన్నాడు.

 

అయితే బంగ్లాదేశ్ విజయం సాధించిన తర్వాత ఆటగాళ్లంతా బంగ్లా బాబులంతా తమ జెండాని మైదానంలోకి తీసుకొని వచ్చి సంబరాలు చేసుకుంటూ భారత్ ఆటగాళ్లపై వ్యక్తిగత దూషణలకు దిగినట్టు స్టంప్ మైక్ లో రికార్డు అయింది. భారత ఆటగాళ్లు కూడా దీనికి బదులు ఇవ్వడంతో ఇరు ఆటగాళ్ళు ఒకరిని ఒకరు తోసుకోవడం, చాతీ చాతీ రాసుకోవడం, అడ్డుకోవడం, ఒకరి మీదకు ఇంకొకరు వెళ్ళడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జాతీయ జెండా నేలకి తాకిన ఘట్టాన్ని కూడా మనం పైనున్న ఫోటోలో చూడొచ్చు. దీనిపై ఐసీసీ ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: