కరోనా మహమ్మారి జనాలనే కాదు... వ్యాపార రంగాలనూ పట్టిపీడిస్తోంది. చైనా నుంచి దిగుమతయ్యే చోటామోటా ఐటమ్స్‌ నిలిచిపోవడంతో... చిన్నాచితక వ్యాపారులు నష్టపోతున్నారు. చైనా నుంచి వచ్చే కంటైనర్లు సగానికిపైగా తగ్గాయి. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వీటిపై ఆధారపడ్డ వ్యాపారాలు దివాళా తీస్తున్నాయి. 

 

హైదరాబాద్‌లో చిన్నా చితక వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకూ ప్రత్యక్షంగానో... పరోక్షంగానో చైనాపై ఆధారపడి ఉంటాయి. చైనా నుంచి దిగుమతైన సరుకు వివిధ స్థాయిల్లో దిగుమతి దారులు, హోల్‌సేల్‌ ట్రేడర్లు, డీలర్లు, రిటైలర్ల నుంచి చివరకు చిరు వ్యాపారులకు అందుతుంది. తక్కువ ధరకే లభిస్తాయన్న ఆలోచనతో చాలా మంది చైనా వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. 

 

వివిధ దేశాల నుంచి సముద్ర మార్గంలో షిప్స్‌ ద్వారా వచ్చిన కంటైనర్లు ముంబై, చెన్నై, వైజాగ్‌ పోర్టుల ద్వారా సరుకు దిగుమతి అవుతూ... అక్కడి నుంచి హైదరాబాద్‌ మూసాపేటలోని ఇన్‌లాండ్‌ కంటైనర్‌ డిపోకి చేరుకుంటాయి. కంటైనర్లకు కస్టమ్‌ డ్యూటీ చెల్లించి దిగుమతిదారులు తమ గోడౌన్‌లకు మళ్లించుకుంటారు. ఐతే కరోనా భయంతో  చైనా నుంచి వచ్చే దిగుమతులు సగానికి సగం తగ్గిపోయాయి. దీంతో ఇక్కడి వ్యాపారాలూ నష్టపోతున్నాయి. గతేడాది అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఆర్డర్‌ చేసిన కంటైనర్లు అక్కడి నుంచి రిలీజ్‌ కాగా... అవి ఇప్పటికే ముసాపేట్లోని ఐసీడీకి చేరుకున్నాయి. అయితే... జనవరిలో ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించి వస్తువుల రవాణాపై స్పష్టత లేకుండా పోయింది. 

 

కంటైనర్లు చైనా నుంచి రిలీజ్‌ అవడం లేదు. చైనాలో పలు పరిశ్రమల్లో ప్రొడక్షన్‌ నిలిచిపోయింది. జనాలు బయటకు వెళ్లాలంటేనే హడలెత్తుతున్నారు. వూహాన్‌కు దూరంగా ఉన్న సిటీస్‌లోని పరిశ్రమలు రన్‌ అవుతున్నా కార్మికుల కొరత ఏర్పడింది. చైనాలో ఇప్పటికే తయారైన ఉత్పత్తులు కంటైనర్లతో రెడీ గా ఉన్నా.. సముద్రమార్గంలో చైనా వెళ్లేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలు జంకుతున్నాయి. 

 

చైనా నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులు సర్దుబాటు లెక్కల ఆధారంగానే నడుస్తాయి. ఓ వస్తువు చైనాలో  తయారై దిగుమతి అయిన తర్వాత.. దిగుమతిదారుల నుంచి దాన్ని విక్రయించే కిందిస్థాయి వ్యాపారి వరకు మరో కంటైనర్‌ వచ్చే సమయానికి సర్దుబాటు అయ్యేలా సరుకు సిద్ధం గా పెట్టుకుంటారు. కొత్త సరుకు రావడానికి 30 నుంచి 45 రోజుల వ్యవధి ఉంటుండటంతో.. అంత వరకు సర్దుబాటు అయ్యేలా ముందే ప్లాన్‌ చేసుకుని వస్తువులను దిగుమతి చేసుకుంటారు.

 

ముఖ్యంగా కాస్మెటిక్స్‌, చిన్నపిల్లల ఆట వస్తువులు, దుస్తులు, ఆటోమొబైల్‌ వస్తువులు,  మొబైల్‌ పరికరాలు, చైనా ఫోన్లు, వాచీలు, వైపర్లు, చాక్లెట్లు ఇలా ఎన్నో రకాల వస్తువులు మన మార్కెట్‌లోకి చైనా నుంచి వచ్చేవే. కరోనా ప్రభావంతో దిగుమతులు నిలిచిపోవడంతో... ఇక్కడ వాటినే నమ్ముకున్న చిన్నాచితక వ్యాపారులు నష్టపోతున్నారు. చైనీస్‌ ప్రాడక్ట్స్‌కి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. మార్కెట్లో చైనీస్‌ ఐటమ్స్‌ ఇప్పుడు దొరుకుతున్నా... రెండు మూడు నెలల్లో విపరీతమైన కొరత తప్పదంటున్నారు వ్యాపారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: