భారత జట్టులో ధోనీ సేన అత్యుత్తమ జట్టు అని అందరికి తెలిసినదే. ధోని ధనాధన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక ఆయన నాయకత్వం గురించైతే.. క్రికెట్ క్రీడను ఇష్టపడే చిన్నపిల్లాడినుండి, పెద్ద వయస్కుడివరకు ఎవరిని అడిగిన... ఇట్టే చెప్పేస్తారు.. అతను లీడ్ చేయడంలో మాస్టర్ అని! మరి అలాంటి మనిషినే లీడ్ చేసిన తన ప్రేయసి సాక్షి గురించి, ఆమె చూపులకి రన్ అవుట్ అయిన ధోని గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా, బోరుకొట్టని ప్రణయ క్రీడ అది...  

 

ఇటీవల మహేంద్ర సింగ్ ధోనీ, ఓ టీవీ కార్యక్రమంలో.. చిన్న పిల్లల ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ పిల్లాడు ధోనీని తన ప్రేమ గురించి అడిగాడు. సాక్షికి ఎలా ప్రపోజ్ చేశావని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు నవ్విన ధోనీ, "నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేక, ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా?" అని సదరు కుర్రాడిని ప్రశ్నించాడు. దానికి అతను లేదని చెప్పాడు. ఆ తర్వాత తన ప్రేమ కథను ధోని ప్రస్తావిస్తూ... తాను అందరిలా తన భార్య సాక్షికి ప్రపోజ్ చేయలేదని... అదో అద్భుత విషయమని.. సరదాగా చెప్పుకొచ్చాడు.  

 

టీమిండియా ఆడుతుండగా.. ఓ స్నేహితురాలి ద్వారా పరిచయమైన సాక్షికి తానే ప్రపోజ్ చేశానని చెప్పాడు. అంతటితో ఆగకుండా..పెళ్లి చేసుకుంటావా? అని కూడా అడిగానని చెప్పాడు. అయితే, సాక్షి తన మాటలను లెక్క చేయలేదని, ఆ తర్వాత తాను నిజంగానే పెళ్లి ప్రస్తావన తెచ్చానని, రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. ప్రేమ విషయంలో జాగ్రత్తగా వహించాలని, పెళ్లి చేసుకుంటేనే ప్రేమించాలని, లేదంటే అవసరంలేదని, ప్రేమ పేరుతో మోసం చేయరాదని, లేదా మోసపోరాదని ధోనీ ఆ విద్యార్థులకు సూచించాడు.

 

ధోని మంచి మనిషే కాదు.. మంచి క్రికెటర్... అంతకు మించి, మంచి వక్త కూడా... ఇది కొద్ది మందికే తెలుసు. అయితే సెలిబ్రిటీ ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ధోని ప్రేమ కధల గురించి.. ఎవరకి నచ్చిన కథను వారు రాసుకుంటారు.. ఇది ఇంకో వెర్షన్.. మహేంద్ర సింగ్ ధోని, సాక్షి ఇద్దరూ బాల్యస్నేహితులు. ఇద్దరి తండ్రులు రాంచీలో మికాన్ కంపెనీలో ఒకే చోట పనిచేసేవారు. ధోని, సాక్షి ఒకే స్కూల్లో చదివారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. సాక్షి కుటుంబం డెహ్రాడూన్కు వెళ్లింది. 2007లో సాక్షి ధోనిని కోల్కత్తాలో కలిసింది. ఇండియా పాకిస్తాన్ సిరీస్ జరుగుతున్న రోజులవి. ధోని తాజ్ బెంగాల్ హోటల్లో బస చేశాడు. సాక్షి అక్కడ ఇన్టెర్న్గా పనిచేసేది. అక్కడ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: