వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ , భారత్ ల మధ్య జరుగుతున్న తొలిటెస్టు లో మొదటి రోజు వరుణుడు అడ్డుపడడంతో 55 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం తో మ్యాచ్ నిలిచిపోయేసరికి మొదటి ఇన్నింగ్స్ లో భారత్  5వికెట్ల నష్టానికి 122పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు న్యూజిలాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్ పృథ్వీ షా (16) నిర్లక్ష్యంగా ఆడి వికెట్ ఇచ్చుకోగా ఆతరువాత పుజారా(11), కెప్టెన్ కోహ్లీ (2) కూడా వెంటనే పెవిలియన్ కు చేరడం తో భారత్ 40పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈదశలో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. 
 
అయితే 34 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద మయాంక్ వెనుదిరగగా ఆతరువాత వచ్చిన తెలుగు తేజం హనుమ విహారి(7) కూడా నిరాశపరిచాడు.దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈక్రమంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ,రహానే ల జోడి మరో వికెట్ పడనీయలేదు. వీరిద్దరూ కుదురుకుంటున్న సమయం లో మ్యాచ్ 55ఓవర్ల తరువాత వర్షం ప్రారంభమై ఎడతెరపి లేకుండా కురవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. ప్రస్తుతం రహానే (38*),పంత్ (10*) పరుగులతో క్రీజ్ లో వున్నారు. ఇక న్యూజిలాండ్ అరంగేట్ర బౌలర్ కైల్ జమైసన్ అదరగొట్టాడు. పుజారాను అవుట్ చేయడం ద్వారా టెస్టు కెరీర్ లో మొదటి వికెట్ తీసిన అతను ఆ తరువాత కోహ్లీ, విహారి లను అవుట్ చేసి తొలి రోజు మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. జమైసన్ కు తోడు బౌల్ట్,సౌథీ చెరో వికెట్ తీశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: