వరుణుడు కరుణించకపోతే ప్రపంచ అగ్రశ్రేణి ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ జట్లు సెమీస్ నుంచే నిష్క్రమించాల్సిందే . ప్రపంచ కప్ మహిళా టి ట్వంటీ క్రికెట్ టోర్నీ సెమీస్ కు వర్ష గండం ఉన్నట్లు వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు . ఒకవేళ వరణుడు కనుక మ్యాచ్ అడ్డుకుంటే భారత్ , దక్షిణాఫ్రికా సెమీస్ విజయం తో నిమిత్తం లేకుండానే ఫైనల్ కు చేరనున్నాయి .  సెమీస్ లో భారత్ జట్టు ఇంగ్లాండ్ ను ఎదుర్కోనుంది . మహిళా ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ ఫైనల్ లో ఇదే ఇంగ్లాండ్ జట్టు మిథాలీ రాజ్ నేతృత్వం లోని ఇండియా ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ గా ఆవిర్భవించింది .

 

ప్రస్తుత  టి ట్వంటీ టోర్నీ లో హర్మాన్ కౌర్ నేతృత్వంలోని  భారత్ మంచి జోరు మీద ఉంది . దీనితో  సెమీస్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి, ప్రపంచకప్ లో ఎదురైన పరాజయానికి  ప్రతీకారం తీసుకునే అవకాశం భారత్ జట్టుకు లభించనుంది  . ఇక మరొక సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తో దక్షిణాఫ్రికా జట్టు తలపడనుంది . ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు సిడ్నీ  వేదికగా నేడు  జరగనున్నాయి . అయితే సిడ్నీ ని వర్షాలు ముంచెత్తుతున్నాయి . ఇప్పటికే ఇక్కడ జరగాల్సిన రెండు మ్యాచ్ లు రద్దయ్యాయి .

 

 సెమీస్  మ్యాచ్ లు  సాగినా, సజావుగా కొనసాగే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు . ఒకవేళ వర్షం కారణంగా  సెమీ ఫైనల్ మ్యాచ్ లు రద్దయితే  గ్రూప్ దశ లో అగ్రస్థానం లో నిలిచిన భారత్ , దక్షిణాఫ్రికా జట్లు నేరుగా ఫైనల్ కు చేరుకునే అవకాశాలున్నాయి . దీనితో వాతావరణం అనుకూలించకపోతే ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా జట్లు సెమీస్ నుంచి నిష్క్రమించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంటుంది .   

మరింత సమాచారం తెలుసుకోండి: