ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ 20 ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ లో టీమిండియా ,ఆస్ట్రేలియా ను ఢీ కొట్టనుంది. లీగ్ మ్యాచ్ ల్లో వరస విజయాలతో సెమిస్ లోకి ప్రవేశించిన భారత్ కు అదృష్టం వరుణుడి రూపంలో  వచ్చింది.  నిజానికి ఈ రోజు మొదటి సెమిస్ లో టీమిండియా, ఇంగ్లాండ్ తో తలపడాల్సి వుంది కానీ  ఎడతెరిపి లేని వర్షం వల్ల  మ్యాచ్ ను రద్దు చేశారు. సెమిస్ కు రిజర్వ్ డే కూడా లేకపోవడంతో గ్రూప్ లో ఎక్కువ పాయింట్లు కలిగిన జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తుంది దాంతో  భారత్ నేరుగా ఫైనల్ లోకి ప్రవేశించింది.  
 
ఇక ఈరోజు జరిగిన రెండో సెమిస్ లో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో సౌతాఫ్రికా పై 5 పరుగుల తేడాతో గెలిచి ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20ఓవర్ల లో 5వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం రావడంతో సౌతాఫ్రికా లక్ష్యాన్ని 13ఓవర్ల లో 98 గా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా  నిర్ణీత ఓవర్ల లో  5వికెట్ల నష్టానికి 92పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. దాంతో వరసగా ఆరోసారి టీ 20 ప్రపంచ కప్ లో ఆసీస్ ఫైనల్ కు చేరింది. ఆదివారం మెల్బోర్న్ లో భారత్ ,ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మరి హర్మాన్ ప్రీత్ కౌర్ సేన తొలి సారి టీ 20ప్రపంచ కప్ ను ముద్దాడి చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: