వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ బ్యాట్ తో  వీరవిహారం చేయడం తో శుక్రవారం శ్రీలంక తో జరిగిన రెండో టీ 20లో వెస్టిండీస్ 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి  రెండు మ్యాచ్ ల టీ 20సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. రెండో టీ 20లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20ఓవర్ల తో  6వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. శనాక (31*),తిసారా పేరారే (21*) రాణించారు. 
 
అనంతరం లక్ష్య ఛేదన లో విండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సిమ్మన్స్ మూడో ఓవర్ లోనే వెనుదిరగగా తరువాత వచ్చిన హేట్మెయర్  తో కలిసి మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. హేట్మెయర్(43*) తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడగా బ్రెండన్ కింగ్ మాత్రం బౌండరీల తో రెచ్చిపోయాడు. అయితే 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బ్రెండన్ కింగ్ అవుట్ కాగా ఆతరువాత వచ్చిన రోమన్ పావెల్ కూడా వెంటనే వెనుదిరిగాడు. ఈ దశ లో క్రీజ్ లోకి వచ్చిన రస్సెల్, శ్రీలంక బౌలర్ల కు చుక్కలు చూపెట్టాడు. కేవలం 14బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో 40పరుగులతో అజేయంగా నిలిచి  రస్సెల్ 17 ఓవర్ల లోనే విండీస్ ను విజయ తీరాలకు చేర్చాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కింది. ఇక  మూడు వన్డేల సిరీస్ లో శ్రీలంక చేతిలో  వైట్ వాష్ కు గురైన వెస్టిండీస్ , టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి పర్యటనను ముగించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: