వరణుడు  మ్యాచ్ ను అడ్డుకుని ఒక జట్టును నేరుగా  ఫైనల్ కు చేరిస్తే , మరొక మ్యాచ్ ను పాక్షికంగా అడ్డుకుని ఇంకొక  జట్టు ను ఇంటికి పంపించి వేశాడు  . ప్రపంచ కప్ మహిళా టి ట్వంటీ టోర్నీలో  ఈ రెండు మ్యాచ్ లు సిడ్నీ వేదికగా జరిగాయి . ఇంగ్లాండ్ తో జరగాల్సిన  సెమీస్ మ్యాచ్  వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్ దశలో అన్ని మ్యాచ్ ల్లో విజయాలు  సాధించిన  భారత్ జట్టు నేరుగా ఫైనల్ ప్రవేశించింది .

 

సెమీస్ మ్యాచ్ రద్దు కావడం పట్ల భారత్ కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేసింది  . సెమీస్ మ్యాచ్ జరగకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది . ఫైనల్ లో విజయం పై ధీమా వ్యక్తం చేసింది . ఇక మరొక సెమీస్ లో ఢిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా   , దక్షిణాఫ్రికా జట్టును డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఐదు  పరుగుల తేడా తో ఓడించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది . ఈ మ్యాచ్ కు కూడా వరణుడు అడ్డంకిగా మారుతాడని భావించినా , దక్షిణాఫ్రికా విజయాన్ని మాత్రం పరోక్షంగా అడ్డుకున్నాడు . ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ పూర్తి చేయగానే వర్షం కురవడం , దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసే సమయానికి ఓవర్లను కుదించాల్సి రావడం తో ఫలితం పై ప్రభావం చూపిందని క్రీడా పరిశీలకులు అంటున్నారు .

 

ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ ప్రారంభించి 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 134 పరుగులు సాధించింది . జవాబుగా   దక్షిణాఫ్రికా 13  ఓవర్లలో 93 పరుగులు సాధించింది . వరణుడు మ్యాచ్ అడ్డుకుని ఉండి ఉండకపోతే ఫలితం మరోలా ఉండి ఉండేదని క్రీడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: