2018 మార్చి 18.. సరిగ్గా ఇదే రోజు శ్రీలంక లోని కొలొంబో వేదికగా జరిగిన నిదహాస్ ట్రోఫీ ట్రోఫీ ఫైనల్లో ఇండియా- బంగ్లాదేశ్ తలపడగా చివరి బంతికి  సిక్స్ కొట్టి  ఒంటి చేత్తో భారత్ ను గెలిపించి టీమిండియా వికెట్ కీపర్  దినేష్ కార్తీక్ హీరో అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎప్పటికి మర్చిపోరు. శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన  ఈ టీ 20 ట్రై సిరీస్ లో భారత్ -బంగ్లా ఫైనల్ కు చేరుకున్నాయి. ఇక ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 77 పరుగులతో షబ్బీర్ రెహమాన్ రాణించాడు. 
 
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 32పరుగులకే శిఖర్ ధావన్, సురేష్ రైనా రూపంలో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాహుల్ తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఇక గెలుపు ఖాయమనుకుంటున్న తరుణంలో వరసగా వికెట్లు తీసి బంగ్లా రేస్ లోకి వచ్చింది. 10 ఓవర్లలో 88/2 వున్న స్కోర్ 18ఓవర్ ముగిసే సరికి 133/5. భారత్ విజయం సాధించాలంటే 12బంతుల్లో 34పరుగులు కావాలి అప్పటికే క్రీజ్ లో వున్న విజయ్ శంకర్ బాల్స్ మిస్ చేస్తూ  తడబడుతున్నాడు దాంతో మ్యాచ్ పోయినట్లే అనుకున్నారు. 
 
కానీ 19ఓవర్ లో క్రీజ్ లోకి వచ్చిన దినేష్ కార్తీక్  ఆ ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు అప్పటి దాక అద్భుతంగా బౌలింగ్ చేసిన రూబెల్ హాసన్..కార్తీక్ దెబ్బకు ఆ ఒక్క ఓవర్ లోనే 22 రన్స్ ఇచ్చాడు. ఇక చివరి ఓవర్ లో 12 పరుగులు చేయాలి. సౌమ్య సర్కార్ బౌలింగ్ కు రాగ మొదటి మూడు బంతుల్లో వైడ్ తో కలిపి మూడు పరుగులే వచ్చాయి దాంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. నాల్గో బంతిని ఫోర్ గా మలిచిన విజయ్ శంకర్ 5వ బంతికి అవుట్ అయ్యాడు.
 
ఇక చివరి బంతికి సిక్స్ కొడితే భారత్ విజయం సాధిస్తుంది. అయితే  పెద్దగా కష్టపడకుండా ఒత్తిడి కి లోను కాకుండా చివరి బంతిని సింపుల్ గా సిక్స్ గా మలిచి భారత్ కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు దినేష్ కార్తీక్. 8 బంతుల్లో 3 సిక్సర్లు రెండు ఫోర్ల తో  29పరుగులు చేసిన కార్తీక్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ ఇన్నింగ్స్ తరువాత కార్తీక్ పై ప్రశంసల వర్షం కురిసింది. ధోని తరువాత బెస్ట్ ఫినిషర్ అంటూ  ఆకాశానికెత్తారు కానీ ఆ నమ్మకాన్నికార్తీక్ ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తరువాత జరిగిన సిరీస్ లలో రాణించకపోవడంతో కార్తీక్  టీం లో స్థానాన్ని కోల్పోయాడు ఇప్పట్లో మళ్ళీ అతను జట్టులోకి రావడం దాదాపు అసాధ్యమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: