2011 వ సంవత్సరంలో వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఎంఎస్ ధోని నాయకత్వంలో ఇండియన్ క్రికెట్ టీం శ్రీలంకపై విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మాజీ క్రీడాశాఖ మంత్రి మ‌హిందానంద అలుత‌గ‌మ‌గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముంబై నగరంలోని వాంఖడే స్టేడియంలో రసవత్తరంగా కొనసాగింది. 10 బంతులు మిగిలి ఉండగానే మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఎంఎస్ ధోని శ్రీలంక చేసిన 275 లక్ష్యాన్ని చేధించేందుకు అర్థ శతకం పరుగులు చేసి ఇండియాని విజయ తీరాల వైపు నడిపించాడు. ఇది జరిగి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న వేళ మ‌హిందానంద అలుత‌గ‌మ‌గే మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా జరిగిందో చెప్పలేదు కానీ ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగేనని ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 

అలుత‌గ‌మ‌గే శ్రీలంక దేశానికి చెందిన న్యూస్.ఫస్ట్ ఛానల్ తో మాట్లాడుతూ... ' 2011 వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో ఆ మాటమీద నిలబడతాను. నేను క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది' అని ఆయన ఆరోపించాడు. 


'శ్రీలంక దేశానికి చెడ్డపేరు రాకూడదని మ్యాచ్ ఫిక్సింగ్ గురించి పూర్తి సమాచారం వెల్లడించడం లేదు. 2011 వ సంవత్సరంలో ఇండియా తో ఆడిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మేము గెలిచే వాళ్ళం కానీ అది ముందస్తుగానే ఇండియా గెలిచే లాగా ఫిక్స్ అయ్యింది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో క్రికెట్ క్రీడాకారుల హస్తం ఉందని నేను చెప్పను కానీ కొన్ని బృందాల ప్రమేయం మాత్రం ఫిక్సింగ్ విషయంలో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను' అని అలుత‌గ‌మ‌గే చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: