ఎంఎస్​ ధోనీ పేరు వినగానే ఓ వైపు క్రికెట్ గుర్తొస్తే.. మరోవైపు కార్లు, బైక్​లు మదిలో మెదులుతాయి. మాహీకి ఆటతో పాటు, వాహనాల సేకరణ అంటే ఇష్టం. మార్కెట్​లో ధోనీకి నచ్చిన ప్రతి కారు, బైక్ తన గ్యారేజీలో దర్శనమిస్తాయి. ఇప్పటివరకు ఈ మాజీ కెప్టెన్​ సేకరించిన వాహనాలపై ఓ లుక్కేద్దామా?​

 

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ ఆటకు ఎంతో మంది క్రికెట్ అభిమానులున్నారు. మైదానంలో మహీ హెలికాప్టర్​ షాట్లు కొడితే ప్రేక్షకులు ఆనందంతో గెంతులు వేస్తారు. ఇంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ధోనీకి కార్లు, బైక్​లంటే ఎంతో ఇష్టం. కొత్తగా మార్కెట్​లోకి వచ్చిన వాహనాల్లో తనకు నచ్చిన వాటిని సేకరిస్తూ ఉండటం మాహీకి సరదా.

 


న్యూజిలాండ్​తో జరిగిన 2019 క్రికెట్​ ప్రపంచకప్​ సెమీఫైనల్​లో చివరిసారిగా భారత్​కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ఇంట్లో అనేక లగ్జరీ కార్లు దర్శనమిస్తాయి. ఫెరారీ 599 జీటీఓ, యమహా ఆర్డీ 350 ఇలా తదితర వాహనాలు ఇందులో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీటిని కొనడమే కాదు, వాటి యంత్ర భాగాల అమరిక గురించీ ధోనీకి క్షుణ్నంగా తెలుసు .

 

లగ్జరీ కార్లపై ధోనీకి ఉన్న ప్రేమ అతని అభిమానులకు సుపరిచితమే. ఇప్పటి వరకు సుమారు 10కార్లకు పైగా సేకరించాడు. వీటిలో ఫెరారీ 599 జీటీఓ, హమ్మర్​ హెచ్​2, జీఎంసీ సియెర్రా సహా పలు అత్యాధునిక కార్లకు మాహీ యాజమాని. గతేడాది మరో కారును తన గ్యారేజీలో చేర్చాడు. జోంగా అనే ఈ వాహనాన్ని భారత సైన్యంలో ఉపయోగిస్తారు.

 

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​కు కార్లే కాదు, బైక్​లన్నా యమ మోజు. వీటిలో ధోనీకి ఎంతో ఇష్టమైన బైక్​ రాజ్​దూత్​ ఆర్డీ 350. ఇప్పటివరకు తన సేకరణలో ఈ రకమైన బైక్​లను ఒకటి కంటే ఎక్కువే కొన్నాడు. ఇక కాన్ఫెడరేట్​ హెల్కాట్​ ఎక్స్​ 32, హార్లే డేవిడ్​సన్​ ఫాట్​బాయ్​, బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​, కవాసకి నింజా జెడ్​ఎక్స్​ 14 ఆర్​, యమహా ఎఫ్​జెడ్​1, డుకాటీ 1098, తాజాగా కవాసకి నింజా హెచ్​ 2 వంటి అద్భుతమైన బైక్​ మోడళ్లు ధోనీ సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి: