వెల్లింగ్టన్: ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న ఏకైక దేశంగా న్యూజీల్యాండ్ రికార్డు సృష్టించింది. వ్యాక్సిన్ రాకముందే జీరో కేసులతో శభాష్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలోనే క్రీడలను కూడా ప్రారంభించేసింది. స్టేడియాలలోకి ప్రేక్షకులనూ పూర్తి స్థాయిలో అనుమతించేసింది. దీంతో అక్కడి స్టేడియాలన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి.


ఈ నేపథ్యంలోనే పాకీస్తాన్‌తో 3 టీ20లు, 2 టెస్టుల సిరీస్ ఆడేందుకు న్యూజీల్యాండ్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. అందులో భాగంగా పాక్ ఆటగాళ్లు న్యూజీల్యాండ్ కూడా చేరుకున్నారు. అయితే ఊహించని విధంగా సిరీస్ కోసం వచ్చిన పాక్ ఆటగాళ్లకు కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో సిరీస్ న్యూజీల్యాండ్ క్రికెట్ బోర్డు అవాక్కయింది.


ఆటగాళ్లు లాహోర్‌లో బయలుదేరినప్పుడు 53 మంది సభ్యుల బృందం వారిని పరీక్షించిందని, ఈ నెల 24న క్రైస్ట్‌చర్చ్ చేరుకున్న తర్వాత కూడా వారిని పరీక్షించినట్టు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిని కనీసం మరో 4 సార్లు పరీక్షించనున్నట్టు పేర్కొంది.


గదుల్లో ఉన్న చాలామంది ఆటగాళ్లు ఐసోలేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తమకు తెలిసిందని, వారికి ఫైనల్ వార్నింగ్ ఇస్తామని కివీస్ బోర్డు చెప్పింది. పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ రావడం సంతోషకరంగా ఉన్నా.. ఇక్కడికి చేరుకున్న తరువాత తాము విధించే కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆరోగ్య అధికారి ఆష్లీ బ్లూమ్‌ఫీల్డ్ పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే కరోనాను సమూలంగా నిర్మూలించిన న్యూజిలాండ్‌లో విదేశీ ఆటగాళ్లకు కరోనా సోకడం ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోంది. దీంతో వెంటనే పాక్ ఆటగాళ్లందరినీ క్యారంటైన్‌కు తరలించినట్లు కివీస్ బోర్డు తెలిపింది. వారందరినీ కఠిన క్వారంటైన్‌లో ఉంచనున్నామని, నిబంధనలను పక్కాగా అమలుపరుస్తామని వెల్లడించింది. దీంతో ఆటగాళ్లు ప్రస్తుతం వారి గదులకే పరిమితమై ఉండనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: