సిడ్నీ: రెండో వన్‌డేలోనూ ఆస్ట్రేలియా విజృంభించింది. ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదటి వన్‌డేతో పోల్చితే మరో 15 పరుగులు అధికంగానే చేసిన ఆసీస్ ఈ సారి 390 పరుగులు టార్గెట్‌ను భారత్ ముందుంచింది. గత మ్యాచ్‌లో 375 టార్గెట్‌ ఛేదించలేకపోయిన భారత్ ఈ మ్యాచ్‌లో ఏం చేస్తుందో చూడాలి.

మొదటి మ్యాచ్‌లో మాదిరిగానే ఈ  మ్యాచ్‌లో కూడా భారత్ బౌలర్లు చేతులెత్తేశారు. ఒక్క బౌలర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్రతి ఒక్కరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మినహా మిగతా బౌలర్లందరినీ ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆటాడేసుకున్నారు. స్టీవ్ స్మిత్(64 బంతుల్లో 104) ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు వార్నర్(77 బంతుల్లో 83), ఫించ్(69 బంతుల్లో 60), లబూషేన్(61 బంతుల్లో 70) అర్థసెంచరీలతో మెరిశారు. వీరికి తోడు మ్యాక్స్‌వెల్(29 బంతుల్లో 63) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో బౌండరీల మోత మోగించాడు.

ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో స్మిత్ సెంచరీ మినహా, మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ అర్థసెంచరీలతో మెరిసి ఓ అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఆడిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్థసెంచరీ లేదా ఆపైన స్కోర్లు చేసిన బ్యాట్స్‌మెన్‌లుగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా వన్డేల్లో భారత్‌పై ఇదే ఆస్ట్రేలియాకు ఇఫ్పటివరకు అత్యధిక స్కోరు.

ఇక భారత బౌలర్లలో షమి, బూమ్రా, హార్దిక్‌లకు తలో వికెట్ దక్కాయి. మొత్తం 9 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ షమి 8.11 సగటుతో 73 పరుగులు ఇచ్చాడు. జస్ప్రిత్ బూమ్రా 10 ఓవర్లలో 7.90 సగటుతో 79 పరుగులు సమర్పించాడు. ఇక నవదీప్ సైనీ వేసిన 7 ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ 10 సగటుతో 70 పరుగులు పిండుకున్నారు. వీరితో పాటు యూజ్వేంద్ర చాహల్ 10 ఓవర్లలో 71, రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 60, హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చారు. కాసేపట్లో భారత బ్యాటింగ్ ప్రారంభంకానుంది. ఈ సారైనా భారత బ్యాటింగ్ లైనప్ గాడిలో పడి రాణిస్తారో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: