ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజాం తనను గర్భవతిని చేశాడంటూ ఓ మహిళ మీడియాను ఆశ్రయించింది. దాదాపు 10ఏళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు కుదరదంటూ మాట మారుస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. తాను బాబర్‌కు చిన్ననాటి స్నేహితురాలినని, స్కూల్‌ నుంచే అతడితో కలిసి చదువుకున్నానని, యుక్తవయసుకు వచ్చిన తరువాత తమ మధ్య స్నేహం ప్రేమగా మారిందని, లైంగికంగా కూడా ఒక్కటయ్యామని చెప్పుకొచ్చింది.

క్రికెట్‌లో గుర్తింపు లేకుండా ఉన్న రోజుల్లో బాబర్‌ను తాను ఆర్తికంగా కూడా ఎన్నోసార్లు ఆదుకున్నానని, కానీ అతడికి ఆ కృతజ్ఞత కూడా లేదని వాపోయింది. 2010లో బాబర్ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, కానీ క్రికెటర్‌గా మంచి గుర్తింపు లభించగానే మాట మార్చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం జరగాలని, అందుకే మీడియా ముందుకు వచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. తనను శారీరకంగా వేధించడమే కాకుండా.. తమ విషయం పోలీసులకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకూ పాల్పడేవాడని తెలిపింది.

పాకిస్థాన్‌కు చెందిన సజ్ సిద్ధిఖ్ జర్నలిస్ట్ దీనికి సంబంధించి వీడియోను విడుదల చేశాడు. ‘‘బాబర్ నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అతడి వల్ల గర్భం కూడా వచ్చింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో విచక్షణారహితంగా కొట్టాడు. ఎన్నోసార్లు బెదిరించాడు. అన్నిరకాలుగా నన్ను ఉపయోగించుకున్నాడు’’ అంటూ ఆ మహిళ చెప్పింది.

బాబర్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. వచ్చే నెల 18 నుంచి న్యూజీల్యాండ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌ల కోసం ఈ నెల 27న జట్టు సభ్యులతో కలిసి న్యూజీల్యాండ్ చేరుకున్నాడు. అయితే కొవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నాడు.

ఇదిలా ఉంటే పాక్ క్రికెట్ బోర్డు ఈ ఏడాది మొదట్లోనే బాబర్‌ను 3 ఫార్మాట్లకూ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించిది. దీంతో న్యూజీల్యాండ్‌లో జరగనున్న రెండు ఫార్మాట్ల సిరీస్‌కు బాబర్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిపై ఈ ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: