న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌తో పాటు ఈ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్ పర్వాలేదనిపించినా బౌలర్లు మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా భారత్ తురుపు ముక్క బూమ్రా రెండు మ్యాచ్‌లలోనూ అత్యంత పేలవ ప్రదర్శన చేశాడు. అయితే బూమ్రా ప్రదర్శనకు కెప్టెన్ కోహ్లీ కూడా కారణమేనంటూ మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆరోపించాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్ కోహ్లీ కెప్టెన్సీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇది పూర్తిగా కెప్టెన్సీ వైఫల్యమని, కోహ్లీ వల్లే భారత్ సిరీస్ చేజార్చుకోవల్సి వచ్చిందని అన్నాడు.


ఆస్ట్రేలియా లాంటి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌లో టాప్‌ఆర్డర్‌ వికెట్లు తీయడం ఎంత ముఖ్యమో వేరే చెప్పాల్సిన పని లేదని గంభీర్ అన్నాడు. ఇలాంటి కెప్టెన్సీ తానెన్నడూ చూడలేదని, ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదని గంభీర్ చురకలంటించాడు. ఇది టీ20 సిరీస్‌ కాదన్న విషయం కోహ్లీ గుర్తుంచుకోవాలని హితవు పలికాడు.

సాధారణంగా ఓపెనింగ్ స్పెల్ 5 ఓవర్లు ఉంటుందని, ఈ స్పెల్‌లో ఫ్రంట్ లైన్ పేసర్లు బౌలింగ్ చేస్తారని, కానీ కోహ్లీ విచిత్రంగా బూమ్రాతో రెండే ఓవర్లు వేయించడం ఆశ్చర్యం కలిగించిందని గంభీర్ అన్నాడు. బౌలర్ లయ అందుకోవడం కష్టమని, ఒకసారి ఆ స్టేజ్ చేరుకున్నాక బ్యాట్స్‌మన్ అతడి బౌలింగ్ ఆడడానికి కష్టపడతారని, అలాంటప్పుడే వికెట్లు పడతాయని గంభీర్ అన్నాడు.

‘బూమ్రా-షమి జోడీ కనీసం ఐదు ఓవర్ల స్పెల్ అయినా బౌలింగ్ చేస్తారని నేను అనుకున్నా. కానీ అలా జరగలేదు. ఓ ఫ్రంట్ లైన్ పేసర్‌తో కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేయించడం నాకు ఆశ్చర్యం కలిగింది. బంతి మెత్తబడిన తరువాత వికెట్ల తీయమంటే ఎవరైనా ఏం చేయగలరు..? బూమ్రా కూడా మనిషే కదా..? మరో వైపు ఫించ్ హాజల్ వుడ్‌ను అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు. అతడిని చూసైనా కోహ్లీ అర్థం చేసుకోవాలి’ అంటూ గంబీర్ ఘాటుగా స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: