కాన్‌బెర్రా: విరాట్‌ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 251వ వన్డే ఆడిన విరాట్‌.. 242 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో వేగంగా 12వేల రన్స్‌ జాబితాలో ఇప్పటిదాకా సచిన్‌ టెండూల్కర్‌ పేరిటనున్న రికార్డు బద్దలైంది. సచిన్‌ 300 (309 మ్యాచుల్లో) ఇన్నింగ్స్‌లో ఆ రికార్డు చేరుకున్నాడు. వన్డేల్లో వేగంగా 8వేలు, 9వేలు, 10 వేలు, 11వేల పరుగులు సాధించిన రికార్డులు కూడా  కోహ్లీ పేరిటే ఉన్నాయి.

12వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న విరాట్‌ కోహ్లీ.. ఓ పేలవమైన రికార్డునూ మూటగట్టుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో ఒక్క సెంచరీ కూడా కొట్టని విరాట్.. వన్డేల్లో శతకం చేయకుండానే ఏడాదిని ముగించాడు. దీంతో ఓ ఏడాదిలో ఒక్క వన్డే సెంచరీ కూడా లేకుండా ముగించడం 11 ఏళ్ల తర్వాత అతనికిదే తొలిసారి. 2008లో వన్డే అరంగేట్రం చేసిన విరాట్‌.. 2009 నుంచి ప్రతి ఏటా కనీసం ఒక సెంచరీ అయినా బాదాడు. 2017, 2018లో ఆరేసి శతకాలు సాధించాడు. కానీ.. ఈ ఏడాది మాత్రం మూడంకెల స్కోరు చేయలేకపోయాడు.

విరాట్‌కు పరుగుల వీరుడంటూ ఇప్పటికే గొప్ప పేరుంది. క్రికెట్ లోకం మొత్తం అతడిని రన్ మెషీన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటోంది. విరాట్ వన్డేల్లో మొదట 1000 పరుగుల మార్క్‌ను దాటడానికి 24 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. 114 ఇన్నింగ్స్‌ల్లో 5000 మైలురాయిని చేరుకున్నాడు. 10000 వేల మార్క్‌ను దాటడానికి 205 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఇక సోమవారం ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేతో 242 వన్డేల్లో బ్యాటింగ్ చేసిన కోహ్లీ 12 వేల పరుగుల మార్క్‌ను దాటేశాడు.

మళ్లీ.. హాజెల్‌వుడ్‌కే..
విరాట్‌ వరుసగా నాలుగో వన్డేలోనూ ఒకే బౌలర్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు. ఈ అరుదైన రికార్డును ఆసీస్‌ బౌలర్‌ హాజెల్‌వుడ్‌ దక్కించుకున్నాడు. ఈ సిరీ్‌సలో వరుసగా మూడు వన్డేల్లోనూ విరాట్‌ను అవుట్‌ చేసిన హాజెల్‌వుడ్‌.. అంతకుముందు బెంగళూరులో జరిగిన చివరి వన్డేలో కోహ్లీ వికెట్‌ను పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: