ఇంటర్నెట్‌ డెస్క్‌: సిడ్నీ టెస్టు హీరో హనుమ విహారి ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాడు. దీనికి మొన్నటి టెస్టులో అతడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ఒక కారణమైతే కేంద్ర మంత్రికి అతడిచ్చిన కౌంటర్ మరో కారణం. దీంతో విహారికి సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా మద్దతు పలుకుతున్నారు. విహారి ఓ హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమవిహారి ఎలాంటి ఇన్నింగ్స్‌ ఆడాడో అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్న జట్టును ఓటమి పాలవ్వకుండా ఉండేందుకు అశ్విన్‌తో కలిసి 259 బంతుల్ని డిఫెండ్‌ చేశాడు. పిక్క కండరాలు పట్టేసి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అతడు పోరాడిన తీరుకు ప్రశంసల జల్లు కురిసింది. అయితే కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో మాత్రం ఇందుకు విరుద్ధంగా హనుమ విహారిని అవమానిస్తూ ట్వీట్ చేశాడు.

‘7 పరుగులు చేసేందుకు 109 బంతులు ఆడటం నేరం. టీమ్‌ఇండియా చారిత్రక విజయాన్ని హనుమబిహారి చంపేయడమే కాదు క్రికెట్‌ను హత్య చేశాడు. గెలుపు అవకాశాలు నిలపలేని అతడు ఒక నేరస్థుడు. నోట్‌: క్రికెట్‌ గురించి నాకేమీ తెలియదని నాకు తెలుసు’ అంటూ జనవరి 11న సుప్రియో ఓ ట్వీట్ చేశాడు. విహారిని అవమానించడమే కాకుండా అతడి పేరును ‘బిహారి’ అని రాయడంతో దుమారం రేగింది. దీనికి ఈ తెలుగు క్రికెటర్‌ అత్యంత హుందాగా.. చతురతతో జవాబిచ్చాడు. ‘హనుమ విహారి’ అని మంత్రికి రిప్లై ఇచ్చాడు. దీంతో సుప్రియోకు అదిరిపోయే జవాబు ఇచ్చావంటై నెటిజన్లు విహారిని అభినందిస్తున్నారు. అంతేకాదు.. సుప్రియోపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు.   

అంతేకాదు విహారికి రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా మద్దతు పలికాడు. అతడు కూడా ఓ ట్వీట్‌ చేసి కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది. నెటిజన్లు అశ్విన్‌ను కూడా ప్రశంసిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: